Jyotiraditya Scindia : అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. శాఖలు ఒక్కటే..!

నిన్న(బుధవారం) సాయింత్రం ఆరు గంటలకి రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 44 మంది కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకీ పౌర విమానయాన శాఖ అప్పగించింది అధిష్టానం. ఈ రోజు ఆ శాఖలో జ్యోతిరాదిత్య సింధియా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఆయన తండ్రి మాధవరావ్ సింధియా కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగానే పనిచేశారు.
1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావ్ సింధియా.. పౌర విమానయానం, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన ఎన్నో సవాళ్ళను ఎదురుకున్నారు. ఓ విమానం కూలిన ఘటనకిగాను బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మాధవరావ్ సింధియా మరణించారు. ఆయన వారసుడిగా జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి వచ్చారు. మాధవరావ్ సింధియా ప్రాతినిధ్యం వహించిన గుణ లోక్‌సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
ఇక రాజకీయ పరంగా చూస్తే పౌర విమానయాన శాఖ చేపట్టక ముందు..ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ హయంలో మాధవరావ్ సింధియా రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, మన్మోహన్‌సింగ్ హయంలో జ్యోతిరాదిత్య సింధియా ఐటీ, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాధవరావ్ సింధియా ముందుగా జనసంఘ్‌లో పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా ముందుగా కాంగ్రెస్‌లో పనిచేసి, ఆ తర్వాత బీజేపీలో చేరారు.
ఇప్పడు పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ముందు చాలా సవాళ్ళే ఉన్నాయని అంటున్నారు రాజకీయ నిపుణులు.. కరోనా దెబ్బకు విమానయాన రంగం బాగా దెబ్బతింది. ఇప్పుడు దానిని జ్యోతిరాదిత్య సింధియా ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com