Kabul: విశ్వవిద్యాలయాలకు కంచె.. తాలిబాన్ల దాష్టీకం

Afghanistan
Kabul: విశ్వవిద్యాలయాలకు కంచె.. తాలిబాన్ల దాష్టీకం
కాబుల్ లోని యూనివర్శిటీలకు కంచె వేసిన తాలిబన్ లు; మహిళలను లోనికి ఆహ్వానించని సేన; కన్నీరు మున్నీరు అవుతున్న విద్యార్థినిలు

Kabul: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ల అకృత్యాలకు హద్దే లేకుండా పోతోంది. అయినా ప్రపంచానికి ఆశ్చర్యం కలగకపోవడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలు ఊహించినట్లే ప్రజాస్వామ్యాన్ని అణచివేసి కాలికింద తొక్కేందుకు హీనమైన దారులు వెతుక్కుంటోంది. తాజాగా విద్యార్ధినులు యూనివర్శిటీల్లోకి ప్రవేశించేందుకు వీలు లేకుండా కంచెలు వేసి మరోసారి తమ మనోవికారాన్ని బయటపెట్టుకున్నారు.



మహిళల ఉన్నత విద్యపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వం తాజాగా విశ్వవిద్యాలయాల చుట్టూ కంచె వేసి విద్యార్ధినులను లోనికి వెళ్లనివ్వకుండా సాయుధ సేనలను కాపలా ఉంచుంది. తమ భవిష్యత్తు కళ్లముందే కాలిబూడిదైపోతుంటే విద్యార్ధినులు మౌనంగా రోదించడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు.


అయితే కొందరు విద్యార్దినులు మాత్రం తమకు అండగా నిలబడ్డ సహ విద్యార్ధులతో విశ్వవిద్యాలయాల ముందు ధర్నా చేస్తున్నారు. అమ్మాయిలకు మద్దతుగా అబ్బాయిలు క్లాసులను బ్యాన్ చేసి ఈ ప్రొటెస్ట్ లో పాలుపంచుకోవడం విశేషం. మహిళలు, బాలికలకు కనీస హక్కులు కావాలని నినాదాలు చేశారు.


తొలుత మహిళా హక్కులను గౌరవిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్ ప్రభుత్వం, ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఇస్లామిక్ లాను తు.చ.తప్పకుండా అమలు చేసేందుకు నడుం బిగించింది. ఈమేరకు డిసెంబర్ 20 నుంచి విద్యార్థినులకు విశ్వవిద్యాలయాల్లో అనుమతి నిరాకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story