అమ్మాయిలకు ఆత్మరక్షణనిచ్చే 'కలరిపాయట్టు'.. తెలంగాణ స్కూల్స్‌లో

అమ్మాయిలకు ఆత్మరక్షణనిచ్చే కలరిపాయట్టు.. తెలంగాణ స్కూల్స్‌లో
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించాలంటే వారికి స్వీయ రక్షణ అవసరమని భావించి పాఠశాల స్థాయి విద్యార్థులకు పరిచయం

మహిళలపై నేరాలు పెరుగుతున్నందున, తల్లిదండ్రులు సహజంగానే బాలికల భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందుతారు. అమ్మాయిల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో కలరిపాయట్టు అనే యుద్ధ కళలో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించాలంటే వారికి స్వీయ రక్షణ అవసరమని భావించి పాఠశాల స్థాయి విద్యార్థులకు పరిచయం చేయాలని నిర్ణయించింది. 9,10 తరగతులు చదువుతున్న బాలికలందరూ ఇందులో శిక్షణ పొందడం తప్పనిసరి చేయాలనుకుంటోంది. పాఠశాల విద్యా సంచాలకురాలిగా ఉన్న శ్రీ దేవసేన ఈ యుద్దవిద్యను కేరళలో నేర్చుకున్నారు.

శ్రీదేవసేన గతంలో జనగాం, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ విద్యను అక్కడి పాఠశాలల్లో అమలు చేశారు. దీనికోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. బాలికల, శారీరక, మానసిక ధృఢత్వానికి ఈ యుద్ధ విద్య ఎంతో ఉపకరించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలరిపాయట్టును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఇంతకీ ఈ కళ ప్రత్యేకత ఏమిటి..

యుద్ధవిద్యల్లో అత్యంత ప్రాచీనమైనది కలరిపాయట్టు. కేరళకు చెందిన ఈ విద్య 3 వ శతాబ్దం నాటిదని అంటారు. దేశంలోని అన్ని విద్యలకు మూలకారణం ఈ కలరిపాయట్టు అని అనేక ప్రాచీన గ్రంధాల్లో ప్రస్తావించబడింది. యుద్ధరంగంలో శత్రువును అంతమొందించడమే లక్ష్యంగా ఇందులో శిక్షణ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతతకు, శారీరక ధృఢత్వానికి ఉపకరించే యోగా ఈ శిక్షణలో భాగంగా ఉండడం కలరి ప్రత్యేకత. కేరళలో బాల బాలికలు ప్రాథమిక పాఠశాలలోనే దీనిని నేర్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఈ కళను అనేక మంది విదేశీయులు నేర్చుకునేందుకు కేరళకు వస్తుంటారు.

Tags

Next Story