రేపు కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు..!

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. నరోరాలోని గంగానది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు అసెంబ్లీ సభా ప్రాంగణంలో ప్రజల సందర్శన కోసం అందుబాటులో పెట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు బీజేపీ ఆఫీస్‌కు, అనంతరం అలీగఢ్‌లోని స్టేడియానికి తరలించారు. అక్కడి నుంచి నరోరాలోని గంగానది ఒడ్డుకు తరలించి.. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అటు.. కల్యాణ్ సింగ్ భౌతిక కాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలు సందర్శించారు. కల్యాణ్ సింగ్ విలువైన వ్యక్తిత్వం కలిగిన నేత అని ప్రధాని కొనియాడారు. సాధారణ ప్రజల 'విశ్వాసానికి చిహ్నం'గా నిలిచిన సమర్థుడని అన్నారు. దేశం ఓ విలువైన, సమర్థుడైన నాయకుడిని కోల్పోయిందని అని వ్యాఖ్యానించారు. కల్యాణ్‌సింగ్ ఆదర్శాలు, వాగ్దానాలతో పాటు ఆయన కన్న కలలను సాకారం కోసం కృషి చేస్తాం తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎనలేని అనుబంధం ఉన్న కల్యాణ్ సింగ్.. ఉత్తర్‌ప్రదేశ్‌లో కమల దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. 1932 జనవరి 5న జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలలు జైల్లో ఉన్నారు. 1992 డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన సమయంలో ఆయనే యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో అత్యంత వివాదాస్పద అంశం అదే. ఆందోళనకారులపై కాల్పులు జరపవద్దని అప్పట్లో ఆయన పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com