కంగన రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించిన సీఎం ఉద్దవ్‌ థాకరే!

కంగన రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించిన సీఎం ఉద్దవ్‌ థాకరే!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, హీరోయిన్‌ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో శివసేన, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముంబైలో అడుగుపెట్టొందంటూ శివసేన నేతలు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు కూడా. దీంతో, ముంబై పీఓకే మాదిరి తయారైందంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. అధికార శివసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న కంగన.. ఈనెల 9న ముంబైకి రానుంది. ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ కింద ఆమెకు ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారితో పాటు మరో 10 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు. వీరిలో కమెండోలు కూడా ఉంటారు. తనకు భద్రతను కల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళను ఆయన గౌరవించారని చెప్పారు.

సంజ‌య్ రౌత్‌పై కంగ‌నా మాటల దాడి కొనసాగుతుంది. ఆయన పురుష అహంకారి అని విమర్శించింది. భారతీయ మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమే కార‌ణ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించింది. గతంలో ముంబైలో బతకలేకపోతున్నామని అమిర్‌ ఖాన్‌, నసీరుద్దీన్ షా అన్నార‌ని, మ‌రి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా నిలదీసింది. సెప్టెంబర్ 9న తాను ముంబై వస్తున్నానని.. దమ్ముంటే తనను అడ్డుకోవాలని సవాలు విసిరింది.

మరోవైపు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తన కార్యాలయాన్ని కూల్చబోతున్నారని కంగన ఆరోపించింది. తన అనుమతి తీసుకోకుండా అధికారులు రైడ్‌ చేశారని.. కార్యాలయ కొలతలు తీసుకున్నారని తెలిపింది. తన ఆస్తిని కూల్చివేసే కుట్ర జరుగుతోందని తెలిపింది. ఎలాంటి చట్టవిరుద్దమైన పనులు చేయలేదని.. ఆ కార్యాలయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని పేర్కొంది.

ఇక మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే కంగన రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఉపాధిని పొందుతున్న నగరంపై కొందరికి కృతజ్ఞత ఉండదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు.. కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం కరెక్టేనన్నారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌. ఒకరి అభిప్రాయం మీకు నచ్చకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదన్నారు.

Tags

Next Story