Karnataka: ప్రధాని పర్యటన

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తుమకూరులోని హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ జాతికి అంకితం చేయనున్న ప్రధాని ఇండియా ఎనర్జీ వీక్ 2023 ప్రారంభిస్తారు. అలాగే హరిత ఇంధనాలపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ మొబిలిటీ ర్యాలీని కూడా ప్రారంభించనున్నారు.
ఇక తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్,రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మొన్న కేంద్ర బడ్జెట్‌లోనూ కర్ణాటకకు భారీగానే కేంద్రం నిధులు కేటాయించింది. పెద్దగా జనాకర్షక పథకాల జోలికి వెళ్లని కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మోదీ సర్కారు 5 వేల 300 కోట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈలోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com