Karnataka : 189 మందితో BJP తొలి జాబితా

Karnataka : 189 మందితో BJP తొలి జాబితా

కర్ణాటకలో 189 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ . ఇందులో 52 మందికి కొత్తవారికి అవకాశం కల్పించింది. కీలక నియోజకర్గాలైన పద్మనాభనగర్‌, కనపుర స్థానాల్లో ఆర్‌. అశోక్ బరిలో దిగనున్నారు. ఈ స్థానాల్లో ఆయనకు ప్రత్యర్థిగా డీకే శివకుమార్‌ పోటీ చేస్తున్నారు. ఇక మాజీ సీఎం సిద్దరామయ్యకు పోటీగా వరుణ నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత సోమన్న పోటీ చేయనున్నారు. చామరాజనగర్‌ నుంచి కూడా సోమన్న బరిలో నిలిచారు. రెండు స్థానాల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. ఇక సీఎం బసవరాజు బొమ్మై తన సిట్టింగ్ స్థానం ‌ షిగ్గాన్‌ నుంచి పోటీ చేస్తారు. మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర ... షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మొకల్మూర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శ్రీరాములు... ఈ సారి బళ్లారి రూరల్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఉడిపిలో.. కొత్త అభ్యర్ధి యశపాల్‌ సువర్ణను బరిలో దింపుతున్నారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గత నాలుగు రోజులుగా కసరత్తు చేసి ఎట్టకేలకూ జాబితా రూపొందించింది.

జాబితా తయారీకి ముందు కొందరు సీనియర్లను పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్లు తెలిసింది. దీంతో హైడ్రామా నెలకొంది. ఒకరిద్దరు ఒప్పుకోవడం, మరికొందరు పోటీ నుంచి తప్పుకోవడానికి వ్యతిరేకించడంతో ఆఖరు క్షణంలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ధిక్కార స్వరం వినిపించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణమే లేదన్నారు. తనకు టికెట్ ఇవ్వడంలేదని పార్టీ చెప్పడంపై ఆయన నొచ్చుకున్నారు. హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టర్ గత ఎన్నికల్లో 21 వేల ఓట్ల తేడాతో గెలిచారు. తనకు టికెట్ నిరాకరించడానికి ఒక్క కారణమైనా చెప్పాలని శెట్టర్ కోరుతున్నారు. వాస్తవానికి ఆయన ఇప్పటికే తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు కూడా. ఈ అసమ్మతి స్వరంతో బీజేపీ హైకమాండ్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

అంతకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పను హై కమాండ్ దారిలోకి తెచ్చుకోగలిగింది.ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిపై కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై స్పందించారు. శివమొగ్గ నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈశ్వరప్ప లేఖ రాశారని ధృవీకరించారు. యువతరం కోసం సీనయర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందన్నారు. ఇక... కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. కర్ణాటక లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగనుంది.

Next Story