నేడు కర్ణాటక కొత్త మంత్రుల ప్రమాణం..విజయేంద్ర పదవిపై ఉత్కంఠ

Karnataka cabinet: కర్నాటక కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరో ఇవాళ తేలబోతోంది. మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో చర్చించిన CM బసవరాజ్ బొమ్మై.. అట్నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే తన టీమ్‌ను ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం కొద్దిమందితోనే కేబినెట్‌ను ప్రకటించి.. విస్తరణలో మరికొందరికి చోటు కల్పించనున్నారు. ఇవాళ సాయంత్రమే కొత్తగా మంత్రులు చేపట్టేవారు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తొలి విడతలో 20 నుంచి 26 మందికి కేబినెట్‌లో ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. ఈసారి డిప్యూటీ CM పదవిలాంటిది ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై పార్టీ సీనియర్లతోనూ పలు దఫాలుగా CM బసవరాజ్ బొమ్మై చర్చించారు. మొత్తంగా ప్రాంతీయ, సామాజిక వర్గాల సమీకరణాల్ని బేరీజు వేసుకుంటూ అసమ్మతికి తావులేకుండా కూర్పు ఉండేలా బొమ్మై తన టీమ్ సిద్ధం చేసుకుంటున్నారు. అనుభవానికి, తన వర్గీయులకు బొమ్మై పెద్దపీట వేస్తారా లేదంటే.. యడియూరప్ప సూచించిన వారికే పదవులు కట్టబెడతారా అనేదానిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది. కేబినెట్‌లో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంపై యడియూరప్ప అభిప్రాయాల్ని కూడా తీసుకున్నారు. ఐతే.. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ CMకే ఉంటుందని తన జోక్యం ఏమీ లేదని యడ్యూరప్ప చెప్తున్నారు. ఇక 5 గంటలకు ప్రమాణస్వీకారం చేసే జాబితాలో తాజా మాజీల్లో ఎంత మంది ఉంటారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు బొమ్మై. జులై 28న CMగా ప్రమాణం చేసిన ఆయన.. కూర్పు విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. యడియూరప్ప కుమారుడికి కేబినెట్‌లో చోటు కల్పిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. బీసీ పాటిల్, మురుగేష్ నిరాణి, శివన్నగౌడ్ నాయక్, మహేష్ కుమతల్లి, కేజీ బోపయ్య, డాక్టర్ సి.ఎన్. అశ్వథ్ నారాయణ్, వి. సోమన్న సహా మరికొందరు వరుసగా CMను కలిసిన నేపథ్యంలో వారికి బెర్త్‌లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, అరవింద్ బెళ్లంద్, సతీష్‌రెడ్డి, సీసీ పాటిల్, లక్ష్మణ్ సావడీ సహా కొందరు నేతలు ఢిల్లీలో మకాం వేసి కేబినెట్ బెర్త్ కోసం లాబీయింగ్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. కె. పూర్ణిమ, సునీల్ కుమార్, మునిరత్న, రాజుగౌడ, పి.రాజీవ్ పేర్లు కూడా కేబినెట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అటు, ఈసారి కర్నాటకలో డిప్యూటీ సీఎం పోస్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లు, అసమ్మతుల్ని దృష్టిలో పెట్టుకునే డిప్యూటీ పదవిని కట్ చేయాలని భావిస్తున్నారు. ఎవరికి పదవి ఇచ్చినా మిగతావాళ్ల నుంచి అసమ్మతి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా ఆ పదవినే తీసేస్తే మేలనే నిర్ణయానికి వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com