Karnataka Elections 2023 : మహిళా ఓటర్లే టార్గెట్..!

కర్ణాటకలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మహిళా ఓటర్లే టార్గెట్ గా హామీలను కురిపిస్తుంది. అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2 వేల స్టైఫండ్ ను అందజేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తోపాటు, నెలవారి ఖర్చుల కు రూ.2000లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బెంగళూరు ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. మహిళలకై గృహలక్ష్మి భత్యాన్ని ప్రకటించారు.
పెరిగిన ధరల కారణంగా కుటుంబాన్ని పోషించడం దిగువ మధ్యతరగతికి భారంగా మారిందని ప్రియాంక గాంధీ అన్నారు. మహిళల అభివృద్ధికై కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వీరికోసం ప్రత్యేక మ్యానిఫెస్టోను సిద్దం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా మ్యానిఫెస్టోను తయారు చేస్తే, అందరూ నవ్వారని గుర్తచేసుకున్నారు. ఓట్ల పరంగా లాభం లేకపోయినప్పటికీ మహిళలను దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టో తయారు చేయడం కాంగ్రెస్ కు మంచి పేరు తీసుకొచ్చిందన్నారు.
ప్రియాంక గాంధీ ప్రకటించిన మహిళా పథకాలకు ధీటుగా... అధికార బీజేపీ, మహిళలకు అందించిన పథకాలను ప్రచారం చేస్తోంది. స్త్రీ సామర్థ్య, మహిళా పారిశ్రామికవేత్తల పథకం, 'అమృత్ సెల్ఫ్ హెల్ఫ్ మైక్రో ఎంటర్ ప్రైజ్' పథకాలతో పాటు, వివిధ నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, బ్రాండింగ్ లను ఇప్పటికే స్త్రీలకు అందించినట్లు తెలిపింది. రూ. 43,188 కోట్లను స్త్రీల అభివృద్ధికై కేటాయించినట్లు బీజేపీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్రంలో సీఎం బొమ్మై ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చెప్పారు.
1970లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలకు రుణమాఫీని చేసిందని, బడుగు బలహీన వర్గాలకోసం భూసంస్కరణలను తీసుకొచ్చిందని గుర్తుచేశారు ప్రియాంక గాంధీ. ఎన్నికల ముందు పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com