Karnataka Elections 2023 : కర్ణాటక ఓటర్లలో వందేళ్లకు పైబడినవారు 16వేల మంది

కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేసిన సన్నాహక వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 16,000 మందికి పైగా ఉన్నారని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించబడతాయని చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
"కర్ణాటకలో 12.15 లక్షల మంది 80ఏళ్లకు పైబడిన ఓటర్లు ఉన్నారు, వీరిలో 16వేల 976 మంది వందేళ్ల వయసు కలిగి ఉన్నారు. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారు" అని కుమార్ చెప్పారు.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఇదే అత్యధికం. కర్నాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుండి ఓటు వేసే (VFH) సదుపాయాన్ని ఎన్నికల సంఘం గతంలో ప్రవేశపెట్టింది. పోలింగ్ స్టేషన్‌ను సందర్శించలేని వ్యక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని, గోప్యత పాటించడంతోపాటు మొత్తం ప్రక్రియను వీడియో తీయడం జరుగుతుందని సీఈసీ తెలిపింది.
కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో 224 సీట్లు ఉన్న కర్ణాటకలో అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని అధికార బిజెపి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com