Single Mom: అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగాన్ని వీడలేదు..

Single Mom: అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగాన్ని వీడలేదు..
Single Mom: అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి కొందరి జీవితాల్లో.

Single Mom: జీవితం ఊహించినంత అందంగా ఉండదు.. కాలేజీ చదువులు పూర్తి చేసి కలల ప్రపంచంలోకి అడుగులు పెడుతున్నప్పుడే కష్టాలు, కన్నీళ్లు కౌగలించుకుంటాయి కొందరికి.. అయినా వాటిని అధిగమించి తనలాంటి మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తమ జీవితం మరికొందరికి పాఠం కావాలనుకుంటారు. కర్ణాటక మంగళూరుకు చెందిన తేజస్వీ నాయక్ జీవితం కూడా అలాంటిదే..

తల్లితండ్రి ఉద్యోగస్తులు.. ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెరిగినా చదువు విషయంలో మాత్రం స్ట్రిక్ట్‌గానే ఉండేవారు.. తేజస్వీ కాలేజీ చదువుకు వచ్చేటప్పటికి భర్త మరణం.. కుటుంబాన్ని కృంగదీసింది. అయినా ఆమె ధైర్యం తెచ్చుకుని కూతుర్ని ఇంజనీర్ చదివించింది.


ఐటీ కంపెనీలో మంచి జీతానికి ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆమెకు కొలీగ్‌తో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ముచ్చటైన ఆ జంట సంసారం చూసి విధికి కన్నుకుట్టిందేమో పెళ్లైన ఏడాదిలోపే తేజస్వి భర్త మరణం.. అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి మనసు కకావికలమైంది.

అత్తమామల సూటిపోటి మాటలు.. తమ కొడుకుని తానే పొట్టన పెట్టుకున్నాని, అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చేవారు. మరోపక్క బంధువుల మాటలు.. కానీ అమ్మ మాత్రం ధైర్యం చెప్పేది.. నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయి అని. ఏ నిర్ణయం తీసుకున్నా తన మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేది. దాంతో తానే స్వయంగా ఆలోచించుకుని కడుపులో బిడ్డకు బ్రతుకునివ్వాలనుకుంది. ప్రాణంగా ప్రేమించిన భర్తను తలుచుకుంటూ బిడ్డను ప్రసవించింది తేజస్వి.


అమ్మ మనవరాలి అలనా పాలన చూసుకునేది.. తేజస్వీ ఉద్యోగానికి వెళ్లేది. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగంలో రాణించింది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. అందరికంటే అమ్మ ఇచ్చిన స్ఫూర్తి, ఆమె ఇచ్చిన సహకారం మరువలేనివి అంటుంది తేజస్వి. అమ్మ ఇచ్చిన అత్యుత్తమ సలహాని నిరంతరం గుర్తు చేసుకుంటుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడగలగాలి అని ధైర్యం చెప్పేది.

ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించడం కాస్త సులభమవుతుందనేది. అమ్మ మాటలే తనలో ధైర్యాన్ని నింపాయని అంటుంది తేజస్వి. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఒంటరి తల్లుల్లో స్ఫూర్తి నింపేలా, వాళ్ల మానసిక సమస్యల్ని దూరం చేసేలా సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలు సలహాలు అందిస్తుంది. అలాగే పిల్లల పెంపకం, పిల్లలకు సంబంధించిన పలు వీడియోలపై చిన్న చిన్న వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తుంటుంది. ఎవరైనా ఈ విషయాలకు సంబంధించిన సలహాలు, సూచనలు కావాలంటే అడగొచ్చంటుంది.


అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి కొందరి జీవితాల్లో. ఎంతటి కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలబడాలి.. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లాలి. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలకు చదువు, కెరీర్ చాలా ముఖ్యం అని చెబుతుంది తేజస్వి. ఎట్టి పరిస్థితిలోనూ ఉద్యోగాన్ని వదులుకోకూడదు.. అదే మీకు, మీ కుటుంబానికి ఆధారం అవుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతంది.. సింగిల్ మదర్‌గా తాను ధైర్యంగా ఉండడానికి అదే ఆలంబన అని పేర్కొంది తేజస్వి.. తన జీవితం నుంచి తాను నేర్చుకున్న పాఠం ఇది అని చెబుతుంది.

Tags

Next Story