ఈ నెల 26న కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతుంది..?

Yediyurappa File Photo
Karnataka Politics: కర్ణాకటలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్పను మారుస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నెల 26తో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతాయి. అదే రోజు సీఎం మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీటిపై సీఎం యడ్యూరప్ప స్పందించారు. అధిష్టానం ఒత్తిడి తనపై లేదని..అధిష్టానం ఆదేశిస్తే.. వెంటనే రాజీనామా చేస్తానన్నారు యడియూరప్ప. అయితే ఈనెల 26వ తేదీన ఏం జరుగుతుందోనని అందరు ఆసక్తికరంగా చూస్తున్నారు
కర్ణాటక సీఎం యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్‌పై ఈ నెల 25న హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో 26 తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చారు యడ్యూరప్ప. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు తనపై ప్రత్యేక ప్రేమ్, నమ్మకం ఉన్నాయన్నారు. 75 ఏళ్లు నిండిన ఎవరికీ ఎలాంటి పదవులను బీజేపీ కట్టబెట్టలేదని, కానీ తన పనితీరు నచ్చి 78 ఏళ్ల వయస్సున్న తనకు సీఎంగా అవకాశం కల్పించారన్నారు.
హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరించి..నడుచుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సందేహాలు వీడి తనకు సహకరించాలని కోరారు. మరో మూడ్రోజుల్లో యడ్యూరప్ప ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో... ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26 నాటికి నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్ప తాజా వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
దీంతో యడియూరప్ప వారసుడు ఎవరన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమంటోంది మరో వర్గం. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలంటున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు బీజేపీ నేతలు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్తసీఎంను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనంటున్నారు.
కర్ణాటకలో లింగాయత్ వర్గం జనాభా 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా కొత్త నేతను సీఎంపదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు.
ఇక యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమంటున్నారు. ఆయన వీర హిందుత్వవాది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ చెబుతున్నారు. మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com