KCR Delhi Tour: ఢిల్లీలో కేసీఆర్‌ టూర్ కొనసాగుతుందిలా..

KCR Delhi Tour: ఢిల్లీలో కేసీఆర్‌ టూర్ కొనసాగుతుందిలా..
శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఈరోజు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రితో సమావేశం కానున్నారు.

KCR Delhi Tour: మూడురోజుల పర్యటనకుగాను శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఈరోజు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం కానున్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై కేంద్రమంత్రితో చర్చించనునన్నారు. బోర్డుల పరిధిలోకి తెచ్చే గడువును పెంచాలని తెలంగాణ సర్కార్‌ కోరుతోంది. ఈ నెల మొదట్లోనే కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. అయినా గడువును పెంచలేదు. దీంతో మరోసారి కేంద్రమంత్రిని కలిసి చర్చించనున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య కొన్నిరోజులుగా జలజగడం నెలకొంది. అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ.. తమ నీళ్లను తరలించుకుని పోతున్నారని ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌... కేందమంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది.

అటు ఆదివారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం చర్చిస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story