Telangana :థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం.. జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ

Telangana : థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జార్ఖండ్ వెళ్లారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ చర్చిస్తారని సమాచారం. అలాగే పలు అంశాలపై ఈ ఇద్దరు మాట్లాడుకోనున్నారు. సోరెన్‌తో కలిసి లంచ్ చేసిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వస్తారు. జేఎంఎం అధ్యక్షుడైన హేమంత్ సొరేన్ 2018 మార్చిలో కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి వెళ్లే ముందు కేసీఆర్.. స్వాతంత్రోద్యమ నాయకుడు, గిరిజన ఉద్యమ నేత, జార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడైన బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి.. నివాళులు అర్పించారు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు రాంచీ వెళ్లారు.
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్న కేసీఆర్.. జార్ఖండ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ మార్చి 14 తర్వాత మరోసారి ఢిల్లీ వెళ్లి.. ప్రాంతీయ పార్టీల అధినేతల సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com