Kerala: నెలసరి సెలవులు...

విద్యారంగానికి పెద్ద పీట వేసే కేరళ ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ కళాశాలల్లో నెలసరి సెలవులు ప్రకటించింది. రుతుక్రమ సమయాల్లో ఇకపై ఏ విద్యార్ధినీ ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాలకూ ఇది వర్తించబోతోంది. కొచ్చి లోని కొచ్చిన్ విశ్వవిద్యాలయం నెలసరి సెలవులను అందుబాటులోకి తీసుకువచ్చిన తొలి కళాశాలగా పేరుగడించింది. జనవరి 11 నుంచి ఈ బిల్ ను అమలులోకి తీసుకువచ్చింది.
సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్ధినులకు 75శాతం హాజరు అవసరం ఉంటుంది. తాజా సవరణతో వారి హాజరు శాతానికి మరో 2శాతం అదనంగా కలసివస్తుందిని విద్యాశాఖమంత్రి డా.బిందు వెల్లడించారు. అంతేకాదు 18ఏళ్లు పైబడిన విద్యార్ధినులకు 2 నెలల ప్రసూతి సెలవులు కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాలను మహిళలకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
కొచ్చిన్ విశ్వవిద్యాలయంలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న నమితా జార్జ్ అనే విద్యార్ధి కృషి వల్లే ఈ కొత్త సెలవుల వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. విద్యార్ధి సంఘం నాయకురాలైన నమిత విశ్వవిద్యాలయానికి ఈమేరకు ఉత్తరం రాయగా, అధికారులు సానుకూలంగా స్పందించి చారిత్రాత్మక నిర్ణయానికి నాంది పలికారు. ఇక ఇదే రకమైన సెలవుల క్రమాన్ని స్కూళ్లలోనూ ప్రవేశ పెట్టే దిశగా కేరళ ప్రభుత్వం పావులు కదువుతోంది. 18ఏళ్లు పైబడిన విద్యార్ధినుల సంఖ్య జాబితా అందగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com