Kerala: పసివాడి కోసం రూ. 11కోట్లు దానమిచ్చిన అజ్ఞాతవాసి

Kerala: పసివాడి కోసం రూ. 11కోట్లు దానమిచ్చిన అజ్ఞాతవాసి
స్పైనల్ మస్క్యులర్ అట్రోపీతో బాధపడుతున్న చిన్నారి; ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.17.5కోట్లు; రూ.11 కోట్లు దానమిచ్చిన అజ్ఞాత వ్యక్తి

స్పైనల్ మస్క్యులర్ అట్రోపీతో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా రూ.11కోట్ల రూపాయిలను దానమిచ్చి తన ఉదారతను చాటుకున్నాడు ఓ అజ్ఞాత వ్యక్తి. కేరళకు చెందిన సారంగ్ మీనన్, అతిథి నాయర్ ల చిన్నారి నిర్వాణ్(15నెలలు) స్పైనల్ మస్క్యులర్ డిస్ట్రోపీ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధికి చికిత్స కోట్ల కొద్దీ ఖర్చుతో కూడుకున్నది. చికిత్సలో భాగంగా ఇచ్చే ఒకే ఒక్క ఇంజెక్షన్ ఖరీదే రూ.17.5కోట్లు ఉంటుంది. దీంతో నిర్వాణ్ తల్లిదండ్రులు మిలాప్ అనే సంస్థ ద్వారా క్రౌడ్ ఫండింగ్ కు సిద్ధమయ్యారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటివరకూ రూ.5.4 కోట్లను సమీకరించుకున్నారు. అయితే అకస్మాత్తుగా తమ అకౌంట్ లో 11కోట్లు జమ అవ్వడంతో నిర్వాణ్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. మిలాప్ సంస్థను సంప్రదించగా ఓ అజ్ఞాత వ్యక్తి ఈ మొత్తాన్ని దానం చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి తన వివరాలను గోప్యంగా ఉంచమని విన్నవించుకోవడంతో ఆ వివరాలు బయటకు రాలేదు. ఇక ఇదే విషయాన్ని తమ ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసుకున్నారు తల్లిదండ్రులు. ఆ అజ్ఞాత వ్యక్తికి ఎప్పుడూ రుణపడి ఉంటామని వెల్లడించారు. ఏమైనా ఇలాంటి సంఘటనలే మళ్లీ మనిషిలో కొత్త ఆశలు చిగురింపజేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి అనడంలో సందేహమే లేదు.




Tags

Read MoreRead Less
Next Story