Kerala: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తిని యువతి మృతి..

Kerala: వారంలో ఓరోజన్నా బయట ఫుడ్ తినకపోతే మనసు ఊరుకోదు. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు, మధ్యలో బర్త్‌డే అనో మరొకటనో.. మొత్తానికి రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ తింటే అదో తృప్తి. కాస్త శుచి, శుభ్రత పాటించి కస్టమర్లను తమ దేవుళ్లుగా భావించే హోటల్స్ అయితే ఫరవాలేదు కానీ.. ఏదో ఒకటి పెట్టి జేబు నింపుకుంటే చాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. హోటల్ ఫుడ్ తిని అస్వస్థతకు గురవుతున్న కేసులు వెలుగు చూస్తున్నా అదే నిర్లక్ష్యం.
తాజాగా కేరళకు చెందిన ఓ మహిళ బిర్యానీ తిని ఫుడ్ పాయిజనింగ్‌కు గురై మరణించింది. ఇక్కడికి సమీపంలోని పెరుంబళకు చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్ 31న కాసర్‌గోడ్‌లోని రొమేన్సియా అనే రెస్టారెంట్ నుంచి మండి బిర్యానీ తెప్పించుకుని తిన్నది. బిర్యానీ తిన్న దగ్గర నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి దండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్ణాటకలోని మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆమెకు వైద్యులు అందించిన చికిత్సను కూడా పరిశీలిస్తున్నారని వీణా జార్జ్ తెలిపారు.
ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద రద్దు చేస్తామని ఆమె తెలిపారు. ఈ వారం ప్రారంభంలో, కొట్టాయం మెడికల్ కాలేజీలో ఒక నర్సు కోజికోడ్‌లోని ఒక రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న ఆహారం తిని మృతి చెందింది. వారంలోనే ఇది రెండవ కేసు కావడంతో ఫుడ్ సేప్టీ అధికారులు హోటళ్లను పర్యవేక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com