అప్పుడు స్వీపర్.. ఇప్పుడు ప్రెసిడెంట్!

పంచాయతీ కార్యాలయంలో స్వీపర్ గా పనిచేసిన ఆనందవల్లి అనే మహిళ ఇప్పుడు అదే పంచాయతీ కార్యాలయానికి ప్రెసిడెంట్ గా ఎన్నికై అందర్నీ ఆశర్యపరిచింది. అప్పటివరకు కార్యాలయంలో గదులను శుభ్రం చేసిన ఆనందవల్లి ఇప్పుడు తన చేతులతో ప్రజలకు శుభ్రమైన పాలన అందించనుంది. ఇటీవల కేరళలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే కదా.. అందులో భాగంగానే కొల్లం జిల్లాలోని పఠాన్‌పురం పంచాయతీ ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన సీటు. మొత్తం అక్కడ 13 వార్డులుండగా, తలవూరు వార్డు తరుపున లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థిగా సీపీఐ(ఎం) నుంచి పోటి చేసి గెలిచారు ఆనందవల్లి.
జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌కు ఏడు సీట్లు, యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్‌కు (యూడీఎఫ్) ఆరు సీట్లు లభించాయి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబరుగా ఆనందవల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. 46 ఏళ్ల ఆనందవల్లి గత బుధవారం ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. ఆనందవల్లికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డిగ్రీ తర్వాత తన విద్యను కొనసాగించలేకపోయిన ఆనందవల్లి 90 వ దశకంలో ప్రీ-ప్రైమరీ టీచర్ గా పనిచేశారు. ఇక 2011 నుంచి పార్ట్‌టైమ్ స్వీపర్‌గా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ వచ్చారు.
ముందుగా ఆమె జీతం రూ. 2000 కాగా, ఆ తర్వాత మూడు వేలు, తర్వాత ఆరు వేలు అయింది. పేరుకే ఆమె స్వీపర్ అయినప్పటికీ ఆఫీస్ పనులను కూడా తానే చేసేదానిని అని ఆనందవల్లి తెలిపింది. ఇక నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా పాటిస్తూ అభివృద్ధికి తోడ్పడుతానని ఆనందవల్లి తెలిపింది. కాగా ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 21 ఏళ్ల విద్యార్థి ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురం నుంచి పోటి చేసి గెలిచి కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com