మేడం.. మీ పక్కనే ఆయన ఉన్నారు: ఖుష్బూ ప్రచారంలో పదనిసలు

మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.. వెనకా ముందూ చూసుకుని మాట్లాడాలి అని సాధారణ వ్యక్తులు మాట్లాడితేనే సవాలక్ష జాగ్రత్తలు చెబుతుంటారు. మరి నాయకుల మాటలో తప్పులు దొర్లితే దొరికారంటూ ఏకిపారేస్తారు ఏదో ఒకటి మాట్లాడితే ఎరక్కపోయి ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఖుష్బూ పరిస్థితి అదే అయింది.
తమిళనాట ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. కాంగ్రెస్ నుంచి జంప్ అయిన ఖుష్బూ బీజేపీ కండువా కప్పుకుంది. థౌజెండ్‌లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఖుష్బూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా మైకు అందుకున్న ఆమె నాన్ స్టాప్ స్పీచ్ నవ్వుల పాలైంది.
ఈ నియోజక వర్గం అభివృద్ధి చెందకపోవడానికి కారణం గత నాయకుల పాలనా తీరే అని రొటీన్ పాట పాడింది. దాంతో ఆమె పక్కన ఉన్న ఓ వ్యక్తి కాస్త ఇబ్బంది పడ్డారు. అయినా ఇవేవీ పట్టించుకోని ఖుష్బూ విమర్శల పర్వం గుప్పించింది సదరు నాయకుడి మీద.
ఆమె మాట ప్రవాహం పూర్తయ్యాక వెనుక నుంచి ఓ నేత.. మేడం మీరు ఇప్పటి వరకు మాట్లాడింది మీ పక్కనున్న ఆయన గురించే అని చెవుల్లో గుసగుసలాడాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు ఖుష్బూకి. అక్కడున్న కార్యకర్తలంతా పెద్ద పెట్టున నవ్వుతూ కేకలేశారు. దాంతో ఖుస్బూ కూడా ఇబ్బంది పడ్డారు.
డీఎంకే తరపున ఎమ్మెల్యేగా ఉన్న కేకే సెల్వం ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన గురించే ఖుష్బూ దూషణలాడి నాలిక్కరుచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com