జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందా..? పార్లమెంట్ వేదికగా...

జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందా..? పార్లమెంట్ వేదికగా...
X
One Nation One Election: ఒకే దేశం - ఒక ఎన్నికలకు మోదీ సర్కారు రెడీఅవుతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

One Nation One Election: జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందా? ఒకే దేశం - ఒక ఎన్నికలకు మోదీ సర్కారు రెడీఅవుతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తాజాగా లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన ప్రకటనతో... జమిలీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజూ.. లోక్‌సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

దేశంలో మరోసారి జమిలీ ఎన్నికల మూడ్‌ వచ్చినట్లు కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలు జరుగుతాయో లేదోగానీ.. తాజాగా రాజ్యసభ వేదికగా.... కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.లోక్‌సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.

ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోందన్నారాయన.లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో అన్ని ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసిందన్నారు. దేశంలో 2014, 19 మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 5,814 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.

అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే.. ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొందన్నారు. ఎన్నికల సంఘంతో సహా.. వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి పలు సిఫారసు చేసిందని తెలిపారు. ఆ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి.. జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గ సూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపించామని కేంద్ర మంత్రి తెలిపారు. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికలపై సంస్కరణపై లా కమిషన్ 244, 255 నివేదికలో సిఫారసు చేసిందన్నారు కిరణ్ రిజిజు. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

నకిలీ ఓటర్లను అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డు-ఆధార్‌లను అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు కిరణ్‌ రిజిజు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఒకే వ్యక్తి విభిన్న ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఇక... నేరాభియోగాలు నమోదైన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించడం, వ్యయ నియంత్రణ, ఒపీనియన్‌ పోల్స్, చెల్లింపు వార్తలపై నిషేధం లాంటి ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్‌ రెండు నివేదికలు ఇచ్చింది.

వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ ఆలోచన మాటలకు పరిమితం చేయలేమని.. దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో... న్యాయశాఖ మంత్రి చేసిన ప్రకటన కీలకంగా మారింది.

అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. వీటిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్…‌ వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని కేంద్రం భావిస్తే.. అమలు పెద్ద కష్టం కాదు. కాగా, జమిలి ఎన్నికల ఆచరణపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అటు జమిలి ఎన్నికలను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

Tags

Next Story