వాడ్ని అలా చూడలేకపోతున్నానని అన్న వారం రోజులకే.. : కోట శ్రీనివాసరావు

వాడ్ని అలా చూడలేకపోతున్నానని అన్న వారం రోజులకే.. : కోట శ్రీనివాసరావు
ఆ సీన్ కాస్త ఎవాయిడ్ చేయండి అని.. మీరేం బాధపడకండి.. డూప్ ని పెట్టి చేద్దాం అన్నారు

సినిమాల్లో నటించిన అనుభవం ఎంతో ఉంది.. ఏ పాత్రనైనా అవలీలగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోయగలరు.. అది నటనే అని తెలిసినా.. కొడుకు ఆ పాత్రలో నటిస్తున్న సీను చూసి తండ్రి మనసు తల్లడిల్లింది.. వెన్నులో వణుకు మొదలైంది.. వెంటనే వెళ్లి చెప్పారు. ఆ సీన్ కాస్త ఎవాయిడ్ చేయండి అని.. మీరేం బాధపడకండి.. డూప్ ని పెట్టి చేద్దాం అన్నారు ఆ సీన్ లో నటిస్తున్న మరో నటుడు జగపతిబాబు.. ఆ సీన్ తీసిన వారం రోజులకే నా కొడుకు నా నుంచి దూరమయ్యాడు అని ఆనాటి విషాద సంఘటనను గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు.

గాయం-2 చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందులో మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్ నా కొడుకు వేషం వేశాడు.. జగపతి బాబు మా అబ్బాయిని చంపి నా ఇంటి ముందు తెచ్చి పడేసే సీన్ కోసం లోకేషన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.. షూటింగ్ స్పాట్ కి వెళ్లిన నాకు ఆ వాతావరణం చూడగానే చాలా ఇబ్బందిగా అనిపించింది.. ఎంతైనా కన్నకొడుకు.. సినిమానే అయినా, నటనే అయినా నేను వాడిని అలా పాడి మీద శవంలాగా చూడలేకపోయా.. కాస్త ఆలోచించి జగపతిబాబు దగ్గరకు వెళ్లి.. ఒక మాట చెప్పాలి బాబూ అన్నా.. చెప్పండి సార్ అని అంటూనే మీ వాడు చాలా బాగా చేస్తున్నాడు.. సినిమా పరిశ్రమకి చాలా మంచి విలన్ దొరికాడు.. మీ పేరు నిలబెడతాడు అని ఆయన చెబుతున్నారు.. అది కాదు బాబు.. మీరేమీ అనుకోకపోతే ఒక మాట.. మా వాడిని నేను అలా పాడి మీద చూడలేకపోతున్నా.

తలుచుకుంటేనే వణుకు వస్తుంది. నాకు మనస్కరించడంలేదు.. ఆ సీన్ కాస్త అవాయిడ్ చేయండి. వాడిని అలా చూస్తే నేను చేయలేను అని చెప్పా. జగపతి బాబు ఒక్క క్షణం ఆలోచించి మరేం పర్లేదు కోటగారు.. ఆ సీన్ లో డూప్ ని పెట్టి చేద్దాం.. మీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను అని అన్నారు. ఆ సీన్ లో వాడిని చూడలేనని ఏ ముహూర్తాన అన్నానో కానీ ఆ షూటింగ్ జరిగిన వారం రోజులకే మా వాడికి యాక్సిడెంట్ జరిగింది. ముందు వాడు బైక్ మీద వెళుతుంటే, వెనుక కోడలు, మనవళ్లు కారులో వెళ్తున్నారు. అంతలోనే యాక్సిడెంట్ జరగడం.. వాడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.. కడుపుకోత ఎవరికి అర్థమవుతుంది.. కళ్ల ముందే కట్టుకున్న వాడ్ని పోగొట్టుకున్న మా కోడలు అన్నీ దిగమింగి ధైర్యంగా ఉంది.. అందుకే నాకు ఇద్దరు కూతుళ్లు కాదు.. ముగ్గురు కూతుళ్లు.. మా కోడలు మాతోనే.. మా దగ్గరే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

Tags

Next Story