చిన్నారులకో ఎల్‌ఐసీ పాలసీ.. రోజుకు రూ.60లు ఆదా చేస్తే చేతికి రూ.9 లక్షలు

చిన్నారులకో ఎల్‌ఐసీ పాలసీ.. రోజుకు రూ.60లు ఆదా చేస్తే చేతికి రూ.9 లక్షలు
వీటిల్లో చిల్డ్రన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించొచ్చు.

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల పాలసీలు అందిస్తుంటుంది. వీటిల్లో చిల్డ్రన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించొచ్చు.

ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పేరుతో ఒక పాలసీ అందిస్తోంది. పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పాలసీ లక్ష్యం. పాలసీ టర్మ్ 25 ఏళ్లు. అయితే 20 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని ఈ పాలసీ కింద పొందొచ్చు. ఈ పాలసీ తీసుకోవడం సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ రెండూ పొందొచ్చు. 0-12 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లల పేరుపై పాలసీ తీసుకోవచ్చు.

ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. అందులో మొదటిది.. 100 శాతం మెచ్యూరిటీ బెనిఫిట్ పొందొచ్చు. పాలసీ గడువు ముగియగానే పాలసీ మొత్తం, బోనస్ వంటివి లభిస్తాయి. రెండోది.. 20 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 5 శాతం పొందొచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మెచ్యూరిటీ సమయంలో 75 శాతం పాలసీ డబ్బులు వస్తాయి.

మూడవది.. 20 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం 10 శాతం పొందితే.. మెచ్యూరిటీ సమయంలో 50 శాతం పాలసీ డబ్బులు లభిస్తాయి. నాలుగవది.. 20 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది 15 శాతం తీసుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో 25 శాతం పాలసీ డబ్బులు వస్తాయి. మీరు ఎంచుకునే పాలసీ ఆప్షన్ ప్రాతిపదికన మీ ప్రీమియం కూడా మారుతుంది.

ఉదాహరణకు ఏడాది వయసు ఉన్న చిన్నారుల పేరుపై ఈ పాలసీ తీసుకుంటే.. అప్పుడు పాలసీ టర్మ్ 24 ఏళ్లు అవుతుంది. మీరు 19 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పాలసీ తీసుకుంటే ఏడాదికి దాదాపు రూ.22 వేల ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు దాదాపు రూ.60 ఆదా చేస్తే సరిపోతుంది. ప్రీమియం డబ్బులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున చెల్లించొచ్చు. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.9.3 లక్షలు లభిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story