Madhya Pradesh: కరోనాతో కొడుకును కోల్పోయారు.. కోడలికి మళ్లీ పెళ్లి చేసి అమ్మానాన్నలయ్యారు..

Madhya Pradesh: కరోనాతో కొడుకును కోల్పోయారు.. కోడలికి మళ్లీ పెళ్లి చేసి అమ్మానాన్నలయ్యారు..
Madhya Pradesh: నాగ్‌పూర్‌లో తమ కుమారుడి కోసం కొన్న బంగ్లాను తివారీ దంపతులు నూతన వధూవరులకు బహుమతిగా ఇచ్చారు.

Madhay Pradesh: కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది.. కారణం ఏదైనా పెళ్లైన కొడుకు చనిపోతే కోడలిమీదే అభాండాలు వేస్తారు.. తన వల్లే వాళ్ల కొడుకు చనిపోయాడని కోడలిని రాచి రంపాన పెడతారు.. లేదంటే పుట్టింటికి తరిమేస్తారు.. అయిన వాళ్లదగ్గర కూడా ఆదరణ కరవై ఆత్మహత్యే శరణ్యమని భావిస్తుంది అభం శుభం ఎరుగని ఆ అభాగ్యురాలు.. కానీ ఇక్కడ మనం చెప్పుకునే అత్తమామలు అలాంటి వారు కాదు.. ఆమె పాలిట దేవుళ్లు.. అమ్మానాన్న కూడా అంత మంచిగా ఆలోచిస్తారో లేదో కానీ అత్తమామ ఆలోచించారు.. కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

మధ్యప్రదేశ్ ధార్‌లోని ఒక జంట కరోనా కారణంగా తమ కొడుకును కోల్పోయారు. కోడలు భర్తను కోల్పోయి జీవచ్ఛవంలా ఉంది. యుగ్‌ప్రకాష్ తివారీ ఎస్‌బిఐ మేనేజర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కుమారుడు ప్రియాంక్ తివారీని కోల్పోయారు. కొడుకు మరణంతో భార్యాభర్తలిద్దరూ కృంగి పోయారు.


అంత బాధలోనూ కోడలి గురించి మనవరాలి గురించి ఆలోచించారు. కోడలు రిచా, మనవరాలు తొమ్మిదేళ్ల అన్య తివారీ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకున్నారు. మోడు వారిని కోడలి జీవితం మళ్లీ చిగురించాలని తలపోశారు.. ఆమెకు మళ్లీ పెళ్లి చేసి తమ జన్మ సార్థకత చేసుకోవాలనుకున్నారు. తమ మనసులోని మాటను కోడలికి వివరించి ఆమెను ఒప్పించారు. కోడలికి తగిన వరుడి కోసం వెతికారు. వారి ప్రయత్నం వృధా పోలేదు. పెళ్లికొడుకు దొరికాడు..

అక్షయ తృతీయ పర్వదినాన రిచాను వరుణ్ మిశ్రాకు ఇచ్చి పెళ్లి చేశారు. నాగ్‌పూర్‌లో తమ కుమారుడి కోసం కొన్న బంగ్లాను తివారీ దంపతులు నూతన వధూవరులకు బహుమతిగా ఇచ్చారు. ఏ జన్మలో బంధమో అని ఆమె కన్నీళ్లతో అత్తమామల కాళ్లకు నమస్కరించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వరుణ్ చేయి అందుకుంది.

భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితంలోనే కొన్ని మంచి పనులు చేయాలి. అవి మనసుకు చాలా సంతృప్తిని ఇస్తాయి అని ప్రియాంక్ తల్లి కన్నీళ్లతో చెప్పింది. తనకు దీర్ఘాయుష్షు ఉందని, ఆమెకు సరైన తోడు కావాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని తివారీ దంపతులు తెలిపారు.

ఆదర్శమూర్తులు అత్తామామలు అని స్థానికులు తివారి దంపతులను వేనోళ్ల పొగిడారు.


Tags

Read MoreRead Less
Next Story