Lucknow : ఉసురు తీసుకుంది..!

తల్లి మందలించిందని 10ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లక్నో, పారా బల్దేవ్ ఖాడా ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో బల్దేవ్ ఖాడా ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివసిస్తుంది. తండ్రి కొద్ది నెలల క్రితమే చనిపోయాడు. కుటుంబానికి పోషణ లేక తల్లి నీతు, ఇతరుల ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. 6వతరగతి చదువుతున్న బాలిక ఎప్పుడూ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుండటంతో నీతు మందలించేది. చదువుపట్ల ఆసక్తి కనబరచాలని హెచ్చరించేది.
బుధవారం బాలిక ఆన్ లైన్ గేమ్స్ లో మునిగి ఉండగా తల్లి నీతు కోపానికి గురైంది.. చదువుకోవాలని ఆన్ లైన్ గేమ్స్ పక్కనపెట్టాలని మందలించి.. పనికి వెళ్లింది. మనస్థాపానికి గురైన బాలిక గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. నీతు తిరిగి వచ్చేసరికి కూతురు శవమై కనిపించింది. పారా స్టేషన్ ఇంఛార్జ్ తేజ్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, పోస్ట్ మార్టమ్ నివేదిక రావాల్సి ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com