Lucknow building collapse: డోరేమాన్ లో చూశా.. ప్రాణాలు రక్షించుకున్నా

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా 14మంది ప్రాణాలతో బయటపడ్డారు. అందులో 6 ఏళ్ల చిన్నారి ఉన్నాడు. భూకంపం సంభవించినప్పుడు తనను తాను ఎలా రక్షించుకోవాలో కార్టూన్స్ చూసి నేర్చుకున్నానని ముస్తఫా(6) చెప్పాడు. "ఇల్లు కంపిస్తుండటంతో భూకంపం వచ్చిందని భయపడ్డాను. కార్టూన్ షో డోరేమాన్ లో భూకంపం వచ్చినప్పుడు, తనను తాను ఎలా రక్షించుకోవాలో చూశాను. దీంతో మంచం కింద దాక్కున్నాను"అని ముస్తాఫా చెప్పాడు.
భవనం కంపించినప్పుడు తన తల్లి పరుగెత్తడం తాను చూశానని ముస్తఫా చెప్పాడు. కొద్దిసేపట్లోనే భవనం పూర్తిగా కూలిపోయిందని తెలిపాడు. మొత్తం చీకటిగా అయిందని తాను సృహ కోల్పోయానని.. తనను ఎవరో ఎత్తుకెళ్లడం మాత్రం గుర్తుందని చెప్పాడు. ఈ ఘటనలో ముస్తఫా తల్లి ఉజ్మా హైదర్ (30), అతని అమ్మమ్మ బేగం(70) హైదర్ మృతి చెందారు.
భవన నిర్మాణంలో లోపం కారణంగానే కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీలో లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్, జాయింట్ పోలీసు కమిషనర్ పీయూ మోర్దికా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు.
ప్రమాదం జరిగిన అలాయా అపార్ట్మెంట్ యజమానులు మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు బిల్డర్ నిర్మించిన భవనాల గురించి తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగీ. ఒక వేళ మిగితా భవనాల నాణ్యత బాలేదని తేలితే వాటిని కూల్చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com