ఎన్నికల కమిషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర ఎన్నికల కమిషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఎన్నికల ర్యాలీలు, సభల్ని కంట్రోల్ చేయలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు పూర్తి బాధ్యత CECదేనని చీఫ్ జస్టిస్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. బహుశా ఇందుకు బాధ్యులుగా మీ అధికారులపై మర్డర్ కేసు పెట్టాలేమో అని కూడా అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్బంగా కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిషన్‌దేనని స్పష్టం చేసింది ధర్మాసనం.
మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వాడడం లాంటివి సరిగా అమలుకాలేదని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరేమన్నా వేరే గ్రహంపై ఉన్నారా అంటూ కూడా మండిపడింది. మే 2వ తేదీన జరిగే కౌంటింగ్‌కి అయినా పక్కాగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ప్రక్రియ ఆపుతూ ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. కౌంటింగ్ ఏర్పాట్లపై బ్లూప్రింట్ సమర్పించాలని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడం, కోవిడ్ నుంచి రక్షణ పొందడం తక్షణ కర్తవ్యంగా ఉండాలని గుర్తు చేసింది. కౌంటిగ్ ఏర్పాట్ల బ్లూ ప్రింట్ ఏప్రిల్ 30 కల్లా తమకు సమర్పించాలని ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com