మూడు పొరల మాస్క్ మూడు రూపాయలకే.. ఎన్ 95 మాస్క్ ధర..

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాలని ప్రభుత్వంతో పాటు వైద్యులూ సూచిస్తున్నారు. మార్కెట్లో రకరకాల మాస్కులు వస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరలో ఉండాలని మాస్కు ధరను రూ.3 లకు మించి అమ్మకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మూడు పొరలున్న మాస్కును మూడు రూపాయలకే విక్రయించాలని సూచించింది. ఇక నాణ్యతలో అగ్రగామిగా ఉన్న ఎన్ 95 మాస్కులను రూ.19 నుంచి రూ.49 ల మధ్య విక్రయించాలని పేర్కొంది.
ఈ నిర్ణయింతో మాస్కుల ధరలను నియంత్రించిన రాష్ట్రంగా మహారాష్ట్రను చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మాట్లాడుతూ కరోనా సంక్రమణను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెప్పారు. మాస్కు ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ నేపథ్యంలో మాస్కుల ధరలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమలులో ఉన్నంత కాలం మాస్కు తయారీ సంస్థలు తమ సూచనను అమలు పరచాలన్నారు. కాగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కరోనా కేసులు 8,151. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 16,09,516. వైరస్ బారిన పడి మృతి చెందిన వారు 42,240.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com