వేలం పాటలో సర్పంచి పోస్ట్..‌ రూ.2 కోట్లకు దక్కించుకున్న విశ్వాస్

వేలం పాటలో సర్పంచి పోస్ట్..‌ రూ.2 కోట్లకు దక్కించుకున్న విశ్వాస్
కనీసం 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదిస్తే అదో తుత్తి.. అంతేనండి మరింకేం లేదు.

పదవి అంటే ఎంత మోజు.. తనకి అడ్డుగా వస్తున్న పక్కోడిని పడగొట్టి.. అవసరమైతే అడ్డంగా నరికేసి.. అధికారంలో ఉన్న పార్టీకి ముడుపులు ముట్టజెప్పి ఎలాగైనా టిక్కెట్టు చేజిక్కించుకోవాలి.. ఇదంతా ప్రజలకు ఏదో చేద్దామన్న ప్రేమే.. అబ్బే ఆ మాట మచ్చుకైనా మా డిక్షనరీలో లేదు.. అధికారంలోకి వస్తే నేను, నా బంధుగణం ఎంతో కొంత సంపాదించుకుంటాం.

కనీసం 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదిస్తే అదో తుత్తి.. అంతేనండి మరింకేం లేదు. అందుకే సర్పంచ్ పదవంటే మరీ అంత తక్కువేం కాదని ఓ రెండు కోట్లు ముట్టజెప్పానండీ అని అంటున్నారు మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఉమ్రాన్ గ్రామ నివాసి విశ్వాస్ రావ్ దేవ్.

ఆ ఊళ్లో సర్పంచి పదవి కోసం వేలం పాట జరుగుతోంది. ఎన్నికలు లేకుండా వేలం పాటలో సర్పంచ్ పదవి దక్కించుకోవాలనుకునే వారు ఈ వేలం పాటలో పాల్గొన్నారు. అలా మొదలైన సర్పంచ్ వేలం పాట రూ.1కోటీ 11లక్షలతో ప్రారంభమైంది. ఈ వేలం పాట ప్రారంభమైన దగ్గర నుంచి ఉత్కంఠభరితంగా సాగింది.

పదవిని దక్కించుకోవడానికి పలువురు గ్రామస్తులు పోటీపడుతున్నారు. వేలం ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. అలా పెరిగి ఆఖరికి రూ.2 కోట్ల 5 లక్షలకు విశ్వాస్ రావ్ దేవ్ దక్కించుకున్నాడు.

దీంతో గ్రామంలో ఎన్నికలు లేకుండానే విశ్వాస్ రావ్ దేవ్‌ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అయితే వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామంలో రామేశ్వర దేవాలయం నిర్మించడానికి ఉపయోగిస్తామని గ్రామస్తులు తెలిపారు. కాగా సర్పంచ్ పోస్ట్‌కు జరిగే వేలం పాటను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని 34 జిల్లాల్లో 14,234 పంచాయితీలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులు దక్కించుకోవడానికి గ్రామస్తులు వేలం పాటలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఇలా అపహాస్యం పాలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త, రచయిత జయదేవ్ డోలే ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తులు మాత్రం తాము చేసే పనిని సమర్ధించుకుంటున్నారు. వేలం వేయగా వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధికే ఉపయోగిస్తున్నాం కదా అని అంటున్నారు. అనవసరంగా ఎలక్షన్లు పెట్టి దానికి కొంత ఖర్చు పెట్టే బదులు ఇలా చేస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.. ఎలాగూ డబ్బున్నోడే గెలుస్తాడు.. ప్రజలకు ఏదో చేద్దామని వచ్చేవాడు ఎప్పుడూ గెలవడు.. ఇంకెందుకు అలాంటప్పుడు ఎన్నికలు అంటూ వేలం పాటకు ఓటేస్తున్నారు గ్రామస్తులు.

Tags

Read MoreRead Less
Next Story