Maharastra: ఉద్దవ్ థాక్రేకు వరుస షాకులు

Maharastra: ఉద్దవ్ థాక్రేకు వరుస షాకులు
పార్లమెంట్‌ కార్యాలయంలో ఉద్దవ్ పార్టీకి కేటాయించిన గది నంబర్ 128ను షిండే వర్గానికి కేటాయింపు

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్‌లోనూ ఏక్‌నాథ్‌షిండే వర్గం పాగా వేసింది. పార్లమెంట్‌ కార్యాలయంలో ఉద్దవ్ పార్టీకి కేటాయించిన గది నంబర్ 128ను షిండే వర్గానికి కేటాయించింది పార్లమెంట్‌ సచివాలయం. దాంతో ఇప్పటివరకు ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆధీనంలో ఉన్న కార్యాలయం ఇపుడు షిండే వర్గం పరమైంది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొన్న ఏక్‌నాథ్‌షిండే వర్గానిదే అసలైన శివసేనగా గుర్తిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం షిండే వర్గానికే కేటాయించింది. దాంతో ఈసీ, షిండే వర్గంపై ఉద్దవ్ థాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నుంచి అన్ని ఎత్తుకెళ్లారని విమర్శించారు. పార్టీ పేరు, గుర్తు లాక్కోవచ్చు.. కానీ థాక్రే పేరును మాత్రం ఎవరూ దోచుకోలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అటు శివసేన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది. పార్టీ పేరు, గుర్తు కేటాయింపులపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని గతంలోనే తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించామన్నారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదని ఉద్దవ్ థాక్రే ఆరోపించారు. మరోవైపు విల్లు-బాణం గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఉద్దవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags

Read MoreRead Less
Next Story