Maharastra Politics: మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేల మధ్య హాట్ హాట్ చర్చలు

Maharastra: తెలంగాణలో ఫామ్ హౌస్ పాలిటిక్స్ మాదిరిగానే మహారాష్ట్రలో కూడా క్యాంప్ రాజకీయాలపై హాట్ హాట్ చర్చలు మొదలైయ్యాయి..మహారాష్ట్రలో నాలుగు నెలల క్రితం ఏక్‌నాథ్ షిండే వర్గం జరిపిన క్యాంప్ రాజకీయాలు జరిపిన ఎమ్మెల్యే ల మధ్యలో లుకలుకలు మొదలైయ్యాయి..
ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన కథనాలకు సరిగ్గా సరిపోయే విధంగా మహారాష్ట్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల మధ్య డబ్బుల విషయంలో రచ్చ నడుస్తోంది.. పార్టీ ఫిరాయించేందుకు నువ్వు ఇంత తీసుకున్నావు అంటే నువ్వు ఇంత తీసుకున్నావు అంటూ షిండే వర్గంలోని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మాటల యుద్ధం మొదలు పెట్టారు..
మరోవైపు ఉద్దవ్ ఠాక్రేపై తిరగబడ్డ ఎమ్మెల్యేలకు వచ్చిన ఆఫర్లపై మహారాష్ట్రలో రచ్చ నడుస్తోంది. పంపకాల తేడా వచ్చినప్పుడు దొంగతనం బయటపడినట్టుగానే.. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివాదాస్పద ఎమ్మెల్యేల కామెంట్స్ ఆఫర్ ఇచ్చిన బండారాన్ని బయటపెట్టే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన బచ్చు కదు.. షిండే వెంట అస్సాం వెళ్లడానికి 50 కోట్లు తీసుకొన్నారని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా ఆరోపించారు. దీనిపై కదు కూడా తీవ్రంగానే స్పందించారు. షిండే వెంట వెళ్లడానికి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాను 50 కోట్లను తీసుకొని ఉంటే, తనతోపాటు రవి రాణా.. ఇతర ఎమ్మెల్యేలు అందరూ తీసుకొన్నట్టేనని రివర్స్ ఎటాక్ ఇచ్చారు.
అటు బచ్చూ కడూ కామెంట్స్‌తో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రవి రాణా, ఆయన భార్య నవనీత్ రాణా.. గత రంజాన్ పండుగరోజు ఉద్ధవ్ ఠాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా చదివేందుకు ప్రయత్నించి, శాంతికి విఘాతం కలిగించే యత్నం చేశారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్.. రాణా చేత క్షమాపణ చెప్పించకపోతే.. ప్రభుత్వం నుంచి తప్పుకొంటానని కూడా బచ్చుకదు హెచ్చరించారు. బచ్చుకదు, రాణా ఇద్దరూ అమరావతి జిల్లాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో బచ్చుకదు మంత్రిగా కూడా పనిచేశారు.
రవి రాణాకి వివాదస్పద ఎమ్మెల్యేగా పేరుంది.. అధికారులతో రఫ్‌గా వ్యవహరిస్తారని పేరు. అత్యుత్సాహంతోనే రెండు నెలలు జైలు జీవితాన్ని కూడా గడిపారని అమరావతి నియోజక వర్గ ప్రజలు అంటున్నారు..
ఇక రవి రాణా తనకు నవంబర్ 1 లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బచ్చూ కడూ . ఈ లోగా రాణా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే.. కోర్టులో కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. ఈ కేసులో షిండేను, ఫడ్నవిస్‌ను కూడా ప్రతివాదులుగా చేరుస్తానని హెచ్చరించారు.
ఒక వేళ తాను డబ్బు తీసుకొని ఉంటే.. మిగతా యాభై మంది తీసుకొన్నట్టేనని.. వారికి డబ్బులు ఎవరి నుంచి వచ్చాయో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. మరోవైపు తన తండ్రితో షిండే వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే చెప్తున్నారు.
షిండే పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో వారు ఉన్నారని ఆదిత్య వ్యాఖ్యానిస్తున్నారు. షిండే వెంట వెళ్లిన వారిలో చాలామంది తమకు మంత్రి పదవులు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com