ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి..

ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి..
ఖాళీగా కూర్చుంటే ఎవరు పెడతారు. పూట గడవాలంటే ఏదో ఒక పని చేయాలి. తెరపై నటించడం మాత్రమే తెలుసు. కానీ జీవితంలో నటించడం సాధ్యం కాదు.

ఖాళీగా కూర్చుంటే ఎవరు పెడతారు. పూట గడవాలంటే ఏదో ఒక పని చేయాలి. తెరపై నటించడం మాత్రమే తెలుసు. కానీ జీవితంలో నటించడం సాధ్యం కాదు. మన శక్తి మేర కష్టపడాలి. ఉన్నంతలో బ్రహ్మాండంగా బతకాలి. తనకు తెలిసిన విద్యనే ఉపాధిగా మార్చుకుంది మలయాళీ నటి కార్తీక. తనకి వచ్చిన డ్రైవింగ్ ని పెట్టుబడిగా పెట్టింది. ఓ ట్రక్‌కొని తానే సొంతంగా డ్రైవ్ చేస్తోంది. పండ్ల లోడ్‌తో డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న ఆమెను ఓ రోజు పోలీసులు అడ్డగించారు.

ఆ రాత్రి, పోలీసుల బృందం మలప్పురంలో వాహనాలను తనిఖీ చేస్తోంది. ఒక పోలీసు ఆమె నుండి లైసెన్స్ పత్రాలను అడిగారు.

"వాహనంలో ఏముంది?" అని అడిగాడు పోలీసు.

"ఇది పైనాపిల్ లోడ్" ఒక లేడీ వాయిస్ బదులిచ్చింది.

పోలీసు ఆశ్చర్యంతో డ్రైవర్ వైపు చూశాడు.

"నేను ఈ సరుకును కాసరగోడ్, కన్నూర్‌లకు తీసుకువెళుతున్నాను. నాకు ఆలస్యం అవుతోంది. పండ్లు, కూరగాయలను రవాణా చేయడంలో ఎటువంటి పరిమితి లేదు కదా? లాక్డౌన్ వీటికి వర్తించదు కదా" అని కార్తీక పోలీసులను అడిగింది.

ట్రక్కును తనిఖీ చేసిన తరువాత, పోలీసు ఆమెను చిరునవ్వుతో పలకరించారు. సరే వెళ్లండి అంటూ సంకేతాలు ఇచ్చారు.

కోవిడ్ సంక్షోభం మధ్య కన్నూర్‌లోని అజికోడ్ నివాసి అయిన కార్తీక ట్రక్కుతో వాజక్కులం వెళ్ళింది. ఆమె 1000 కిలోల పైనాపిల్‌ లోడ్‌తోవాజక్కులం నుండి తన స్వస్థలానికి వెళ్ళి అక్కడ మార్కెట్లో పండ్ల వ్యాపారులకు విక్రయించింది. లాభం రవాడంతో పండ్లు, కూరగాయల లోడుతో జిల్లాల మధ్యకు వెళ్లి సరుకును రవాణా చేయాలని నిర్ణయించుకుంది.

"నేను పైనాపిల్‌ను కన్నూర్‌కు తీసుకువస్తున్నాను. తిరుగు ప్రయాణంలో ఎర్నాకుళంలోని దుకాణాలకు కొబ్బరికాయలను సరఫరా చేస్తున్నాను. ఇప్పుడు కన్నూర్ నుండి కాసరగోడ్ నుండి నా పరిచయస్తుల ద్వారా నాకు ఆర్డర్లు వస్తున్నాయి"అని కార్తీక అన్నారు.

వాజక్కుళం నుండి కన్నూర్ వరకు లోడ్ ఎత్తడానికి దించడానికి ఆమెకు సహాయకులు లేరు. అన్ని పనులను ఆమె స్వయంగా చేసుకుంటుంది.

"నేను 2015 నుండి నా గ్రామంలో డ్రైవర్‌గా పనిచేశాను. నాకు వేరే ఉద్యోగం తెలియదు. అందుకే రుణం తీసుకుని ట్రక్కును కొనుగోలు చేసాను. జీవితంలో ప్రయోగం చేయటానికి ధైర్యం చేశాను. రాత్రి పూట ప్రయాణాలను సవాలుగా స్వీకరిస్తున్నాను అని ధైర్యంగా చెబుతోంది కార్తీక.

కార్తీకకు డ్రైవింగ్‌తో పాటు నటించడం కూడా ఇష్టం. 'కెనాలమ్ కైనరం', 'మక్కనా' సహా కొన్ని చిత్రాల్లో కూడా ఆమె నటించింది.

"పాఠశాల రోజుల నుండే నాటకాల్లో నటించేదాన్ని. ఆ అనుభవం సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి నాకు సహాయపడింది. కానీ నేను అక్కడ అనుకున్నంతగా ఎదగలేకపోయాను. మనుగడ కోసం ట్రక్ నడుపుతున్నాను. నాకు మంచి ఆఫర్ వస్తే నేను ఖచ్చితంగా నటిస్తాను "అని అంటోంది కార్తీక.

"డ్రైవింగ్ లో ఉన్నప్పుడు జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను. దానిపై డ్రైవర్ యూనిఫాం ధరించి టోపీ పెట్టుకుంటాను. దాంతో నన్ను ఎవరూ గుర్తు పట్టలేరు అని చిరునవ్వుతో చెప్పింది.

"వాస్తవానికి, నేను ట్రక్కుకు బదులుగా టిప్పర్ కొనాలనున్నాను. భవిష్యత్తులో డబ్బు సంపాదించిన తర్వాత కొంటాను. పూర్తి లోడ్‌తో టిప్పర్‌ను నడపడం నా కల" అని అంటోంది కార్తీక.

కార్తీక భర్త శ్రీజిత్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉన్నారు. ఆమె కుమారుడు శ్రీనాథ్ 8 వ తరగతి చదువుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story