Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. 23 మంది నేతల మద్దతు

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. 23 మంది నేతల మద్దతు
Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గే.. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు అయినట్టే. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదురించిన 23 మంది నేతలు సైతం మల్లికార్జున ఖర్గేకే మద్దతు తెలిపారు.

Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గే.. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు అయినట్టే. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదురించిన 23 మంది నేతలు సైతం మల్లికార్జున ఖర్గేకే మద్దతు తెలిపారు. ఖర్గే నాయకత్వంపై అసంతృప్తి లేనట్టేనని తేలిపోయింది. అటు ఎంపీ శశిథరూర్, త్రిపాఠీ సైతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేసినప్పటికీ.. ఖర్గే కాంగ్రెస్ పీఠాన్ని అధిరోహించడం లాంఛనమే.

పార్టీ పట్ల, గాంధీ కుటుంబం పట్ల విధేయతే మల్లికార్జున ఖర్గేకు అవకాశం కల్పించింది. పార్టీ అధ్యక్షుడిగా మొదటి నుంచి ఎన్నో పేర్లు వినిపించినప్పటికీ.. అనూహ్యంగా ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టబోతుండడంతో.. ఇకపై రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని వదులుకుంటారని తెలుస్తోంది.

ఒక వ్యక్తి-ఒక పదవి సూత్రాన్ని పాటించాలని రాహుల్‌గాంధీ సూచించడంతో.. మల్లికార్జున ఖర్గే సైతం రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత బాధ్యతల నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. ఇకపై ఈ బాధ్యతలు దిగ్విజయ్‌ సింగ్‌ తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మల్లికార్జున ఖర్గేకు సౌమ్యుడిగా పేరుంది. ఇతర పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా హిందీ, ఇంగ్లీషులలో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం కూడా ఉంది. అన్నిటికి మించి సోనియా, రాహుల్‌, ప్రియాంక మద్దతు ఉంది. అందుకే, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వరించబోతోందని చెబుతున్నారు.

అందులోనూ త్వరలోనే కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న రాష్ట్రం కర్నాటకనే. మల్లికార్జున ఖర్గే సైతం కర్నాటక నుంచే రావడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కలిసొస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దళితనేత అవడం కూడా మరో ప్రధాన బలం అంటున్నాయి పార్టీ వర్గాలు.

కర్నాటక గుల్బర్గాలోని వార్‌ వట్టిలో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టిన మల్లికార్జున ఖర్గే.. లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే 9సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

మల్లికార్జున ఖర్గే నామినేషన్‌ పత్రాలపై దిగ్విజయ్‌ సింగ్‌, మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్‌ సింగ్‌ హూడా, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, అధికార ప్రతినిధి అభిషేక్‌ మనూ సింఘ్వీ, మాజీ కేంద్రమంత్రి అజయ్‌ మాకెన్‌ సంతకాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలంతా ఖర్గేకు మద్దతునీయడంతో ఆయనకు పరోక్షంగా అధిష్ఠానం మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడైన ఖర్గే తమకు పూర్తి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో గాంధీ కుటుంబం ఆయనను రంగంలోకి దించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అటు ఎంపీ శశి థరూర్‌, జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠీ కూడా తమ నామినేషన్లు సమర్పించారు. జార్ఖండ్‌ నేత త్రిపాఠీ నామమాత్రంగానే పోటీలో దిగారని, ఇద్దరు దక్షిణాది నేతలు ఖర్గే, శశిథరూర్‌ మధ్యే అసలు పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story