టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మమతా

పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడు పెంచారు. కమలం పార్టీపై గురిపెట్టిన దీదీ.. బిజెపి నేతలపై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. బెంగాల్ అభివృద్ధి, దాడులు ఇలా అన్ని అంశాలపై బిజెపికి సవాల్ విసురుతున్నారు. హ్యాట్రిక్‌పై కన్నేసిన మమతా బెనర్జీ.. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు.
తాజాగా టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు మమతా బెనర్జీ. మేనిఫెస్టోలో నిరుద్యోగులు, మహిళలకు పెద్దపీట వేశారు దీదీ. ఏడాదిలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.. స్టూడెంట్స్‌కి ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని ప్రకటించారు. క్రిషి బంధు పథకం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచారు. బంగ్లా అవాస్ యోజన కింద అదనంగా 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మహిళస్య, తిల్, తంబుల్ సహా సామాజిక వర్గాలకు ఓబీసీ హోదా కల్పించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు నెలకు 500 రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. రాముడి కంటే దుర్గామాత పెద్ద దైవమని మమతా బెనర్జీ అన్నారు. జర్‌గ్రాంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ.. రాముడు దుర్గామాత భక్తుడని.. తరుచూ దుర్గామాతకు రాముడు పూజలు చేసేవాడని చెప్పారు. బిజెపి నేతలు జైశ్రీరాం అని మాత్రమే అంటారని.. జై సియా రాం అని పలకరని ధ్వజమెత్తారు. బిజెపికి ఓటేస్తే ప్రజలెవరూ ధర్మాన్ని పాటించే అవకాశం ఉండదని మమతా ఆరోపించారు. కాగా.. ఇటీవల దాడిలో గాయపడిన దీదీ వీల్ చైర్‌పై నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com