Meerut: 50 ఏళ్ల వయసులో ఎంతో ఓపిగ్గా.. 75వేల అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్..

Meerut: సాధించాలన్న పట్టుదల ఉండాలి కానీ.. వయసుతో పనేం ఉంది.. అయినా వయసు ఒక అంకె మాత్రమే అని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. ఆ జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేంద్ర జైన్ కూడా చేరిపోతారు. 50 ఏళ్ల వయసులో తన సృజనాత్మకతను వెలికి తీశారు. 75వేల అగ్గిపుల్లలతో ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని తయారు చేశారు. సురేంద్ర తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో 2013లో పారిస్‌కు కూడా వెళ్లాడు. అతను రెండు రోజులు టవర్ బేస్ వద్ద కూర్చొని వాస్తుశిల్పంలోని అద్భుతాన్ని గమనించాడు. ఆ అద్భుతాన్ని చూసిన పదేళ్ల తర్వాత తన కలను సాకారం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు. మీరట్‌లోని పార్తాపూర్‌లో నివాసం ఉంటున్న సురేంద్ర, ఉత్తరప్రదేశ్‌లో గోధుమలను పిండి చేసే ఫ్లోర్ మిల్లులను నిర్వహిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో తల్లి తనకు ఎప్పుడూ కొత్తగా ఏదైనా ప్రయత్నించమని చెబుతుండేది అని సురేంద్ర గుర్తు చేసుకున్నారు.
చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని అధిగమించేందుకు రోజూ యోగా చేస్తుంటారట. వృద్ధాప్యం కారణంగా పని చేస్తున్నప్పుడు చేతులు వణికిపోయేవి. యోగాసనాలు వేయడం ద్వారా చేతి వణుకు తగ్గిందని సురేంద్ర ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈఫిల్ టవర్ తయారు చేయడానికి మొత్తం 75,000 అగ్గిపుల్లలు ఉపయోగించానని తెలిపాడు. తన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంతా ఒక గదిలో చేశానని తెలిపారు. అసలు ఈఫిల్ టవర్ ఎత్తు 1100 అడుగులు ఉంటే తాను తయారు చేసిన ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుందని తెలిపారు. టవర్ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన భాగం బేస్ నిర్మించడం. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నా విజయాన్ని నమోదు చేయాలనుకుంటున్నాను అని సురేంద్ర పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com