Doctor cum Model: డాక్టర్ గా రోగులకు సేవలందిస్తూనే.. మోడల్ గా రాణిస్తూ.. 67 ఏళ్ల వయసులో..

Doctor cum Model: మోడలింగ్ రంగంలో యువ మోడళ్లకు పోటీ ఇస్తున్నారు 67 ఏళ్ల డాక్టర్ కమ్ మోడల్ గీతా ప్రకాష్. ఈ రోజు ఆమె జనరల్ ఫిజీషియన్ తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, టోరానీ, జేపూర్ వంటి అనేక మంది డిజైనర్లకు పోజులిస్తూ విజయవంతమైన మోడల్ గా ఎదిగింది.
ఒక పని చేస్తేనే అలసట.. మరో పనికి టైమ్ ఎక్కడిది. కొత్త కెరీర్‌ని ప్రారంభించాలనే ఆశలన్నీ కోల్పోయే వయసులో తనకు మోడలింగ్ అవకాశం ఎలా వచ్చిందో డాక్టర్ మోడల్ షేర్ చేసింది.
"నేను మొదట్లో మోడలింగ్ గురించి ఆలోచించలేదు. నేను డాక్టర్‌గా నా వృత్తిలో నేను సంతోషంగా ఉన్నాను. 57 సంవత్సరాల వయస్సులో మోడల్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.
ఒక రోజు ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ చికిత్స కోసం నా క్లినిక్‌కి వచ్చారు. ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత మోడలింగ్ చేస్తారా అని నన్ను అడిగాడు. నేను మోడలింగ్ చేయడం ఏంటని అన్నాను. కొన్ని నెలల తరువాత, అతడు నాకు లెటర్ రాసి నా ఫోటోలను పంపించమని అడిగాడు. నా దగ్గర ఉన్న పాత ఫోటోలనే నేను అతనికి పంపాను. ఇది జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది.
డిజైనర్ తరుణ్ తహిలియాని యాడ్ లో పాల్గొనే అవకాశం లభించింది. అప్పుడు 'జయ్‌పూర్' బ్రాండ్ వారి 'శాలువా' కోసం మోడలింగ్ చేయడానికి నన్ను సంప్రదించింది, ఎందుకంటే ఆ శాలువాలు ఎక్కువగా నా వయస్సులో ఉన్న స్త్రీలు ధరిస్తారు.
డాక్టర్‌గా తన ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మోడలింగ్ చేయడం ఆమెకు కష్టంగా అనిపించలేదు. పైగా ఇష్టంగా చేస్తున్నారు. "మోడలింగ్‌కు ఓ సమయం పెట్టుకున్నాను. ముందు నా వృత్తి ఆ తరువాతే నా ప్రవృత్తి. నా దగ్గరకు వచ్చే రోగులను ఎన్నడూ నిరుత్సాహపరచలేదు. సమయానికి వారికి ట్రీట్ మెంట్ చేసి పంపిస్తాను. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను.
ఎక్కువగా వారాంతాల్లో మోడలింగ్ అసైన్‌మెంట్‌ల కోసం ప్రయత్నిస్తాను. నేను మోడలింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దానికంటే ముఖ్యంగా నా ప్రజలకు సేవ చేయడం నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఒక ఛారిటబుల్ క్లినిక్‌ని కూడా నడుపుతున్నాను. ఇంటికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తాను అని గీతా ప్రకాష్ ఎంతో ఉత్సాహంగా వివరించారు.
ఆమె పిల్లలు ఆమెను బిల్‌బోర్డ్‌లు, మ్యాగజైన్‌లపై చూడటానికి ఆమె కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. వారి స్పందన గురించి ప్రకాష్ వెల్లడించారు. "వారు నన్ను బిల్‌బోర్డ్‌పై లేదా మరెక్కడైనా నా ఫోటోలు చూసిన ప్రతిసారీ చాలా ఉత్సాహంగా ఉంటారు. అమ్మా అది బావుంది, ఇది బావుంది అంటూ వివిధ మ్యాగజైన్లలో చూసిన నా చిత్రాలను పంపుతుంటారు. ఇది నాకు కూడా సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. " అని అంటారు గీతా ప్రకాష్.
వయస్సు కారణంగా కలలు కనడం మానొద్దు. మీరు చేయాలనుకున్న పనిని ప్రారంభించండి. తప్పకుండా మీకు అందులో ఆనందం ఉంటుంది. ఎంత పెద్దవారైనా, చిన్నవారైనా కలలు కనడం ఆపకూడదు. ప్రపంచంలో దేనికీ వయో పరిమితి లేదు. మీ అభిరుచికి వయస్సు అడ్డుకాకూడదు అని అంటారామె.
ఎవరైనా ఏమనుకుంటారు అనే ఆలోచనను మీ మనసులో నుంచి తీసేయండి.. ఈ రోజు అలా అన్న వారే రేపు మిమ్మల్ని ఈర్ష్య పడతారు. ఆ స్థాయికి మీరు ఎదగాలి అని తొటి మహిళలను ఉద్దేశించి అంటారు గీతా ప్రకాష్. నేను చేయగలుగుతున్నప్పుడు మీరు మాత్రం ఎందుకు చేయగలరు అని సాటి మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com