ఎయిర్‌టెల్ కస్టమర్లకు భారీ షాక్? డేటా లీకైందా?..

ఎయిర్‌టెల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బట్టబయలైందన్న వార్త కస్టమర్లను షాక్‌కి గురి చేస్తోంది. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌కి గురికావడం ఆందోళన కలిగించే అంశం. పైగా హ్యాకర్లు ఆ సమాచారాన్ని అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ టెల్ సిమ్ కార్డులు వాడుతున్న వారి చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నెంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్ టెల్ సర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి దొంగిలించారు. భారతదేశంలోని ఎయిర్ టెల్ వినియోగదారులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారి డేటాను విక్రయించాలనుకుంటున్నట్లు హ్యాకర్లు పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజశేఖర్ రాజహర్యా ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఎయిర్‌టెల్ భద్రతా బృందాలను బ్లాక్ మెయిల్ చేసి 3500 డాలర్ల విలువైన బిట్ కాయిన్ల వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ డీల్ విఫలం అయ్యేసరికి హ్యాకర్లు వారి వెబ్‌సైట్‌లో డేటాను అమ్మకానికి ఉంచారు. దాని కోసం ఒక వెబ్‌సైట్‌ను సృష్టించారు. దొంగిలించిన డేటాలో ఎక్కువ శాతం జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని చందాదారులవని తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని రాజశేఖర్ రాజహర్యా అనే ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ బయటపెట్టారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ను పోస్ట్ చేశాడు. దీనిపై ఎయిర్‌టెల్ ప్రతినిధులు స్పందించారు. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడడానికి అనేక రకాల చర్యలను తీసుకుంటుందని.. తమ వద్ద నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com