ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం
కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. అబ్దుల్‌ కలాం రోడ్డులోని ఎంబసీ కార్యాలయం పేవ్‌మెంట్‌ దగ్గర జరిగిన పేలుడులో.. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. బీటింగ్‌ రీట్రీట్‌ జరుగుతున్న విజయ్‌ చౌక్‌ ప్రాంతానికి కిలో మీటర్‌ దూరంలోనే పేలుడు జరగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది.

ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఘటనాస్థలిలో రసాయనాలతో కూడిన సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ అధికారులు సంఘ‌ట‌నాస్థ‌లంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇజ్రాయిల్‌ ఎంబసీ, అబ్దుల్‌ కలాం మార్గంలో సీసీటీటీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పేలుడు దృష్ట్యా సీఐఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా ‌హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ముఖ్య ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

అటు..ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు రైల్వే స్టేషన్లు, ముఖ్య కార్యాయాల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మరోవైపు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు.

రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమిత్‌షాకు వివరించారు. దోవల్ తో పాటు ఐబీ చీఫ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా జరిగిన పేలుడుపై షాకు వివరించారు. మరోవైపు.. పేలుడు నేపథ్యంలో అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

మ‌రోవైపు ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్‌ ఎంబసీకి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదిలేద‌ని జైశంక‌ర్ పేర్కొన్నారు.

రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడుపై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పందించింది. తామంతా సురక్షితంగానే ఉన్నామని, అప్రమత్తతతోనే ఉన్నామని రాయబార అధికారులు పేర్కొన్నారు. పేలుడు నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూనే ఉన్నామని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.


Tags

Read MoreRead Less
Next Story