Modi Documentary: విచారణకు సుప్రీం ఓకే

2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. వచ్చే సోమవారం వీటిపై విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎల్ శర్మ ఒక వ్యాజ్యం, ప్రముఖ జర్నలిస్టు ఎన్. రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాలని కోరారు. డాక్యుమెంటరీ ప్రసారాలపై నిషేధం విధించడం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని వ్యాజ్యాన్ని సోమవారం నాటి కేసుల్లో చేర్చుతామని పేర్కొంది. ఐతే బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసినవారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు మండిపడ్డారు. సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. అటు స్వతంత్ర విధానాన్ని అనుసరించే దేశాలపై బీబీసీ సమాచార యుద్ధం చేస్తోందని, జర్నలిజం విలువలకు పాతరేస్తోందని రష్యా నిప్పులు చెరిగింది. మోదీపై డాక్యుమెంటరీనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com