New Variant BF7: కలవర పెడుతున్న కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే వేగంగా బీఎఫ్-7

New Variant BF7: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కలవర పెడుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ భారత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో మోదీ సర్కార్ అలర్ట్ అయింది. ఇవాళ మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందడం, ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్ధ్యం కొత్త వేరియంట్‌కు ఉండడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే భారత్‌లో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ సమీక్ష నిర్వహించారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ రంగంలోకి దిగారు.
దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.
అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా బీఎఫ్-7 వేరియంట్ విజృంభనపై అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించారు.
చైనాలో మరణమృదంగం వాయిస్తున్న బీఎఫ్-7 వైరస్.. ప్రపంచంలోని పలు దేశాల్లో విజృంభిస్తోంది. మనదేశంలోనూ కొత్త వేరియంట్ కేసులు నమోదవడంతో.. ఆందోళన మొదలైంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
కరోనా పూర్తిగా అంతరించిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అసలే పండగ సీజన్ రాబోతోంది. క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలతో పాటు దేశంలో సంక్రాంతి సంబరాలు కూడా జరగనున్నాయి. ఇదే సమయంలో కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. దీంతో కరోనా కేసుల పెరుగుదలపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రజలను సూచించింది.
అయితే ప్రస్తుతానికి దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 185 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. క్రియాశీల కేసుల సంఖ్య 3వేల 402గా ఉంది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉండటం ఊరటనిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com