ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు ఎంతో తెలుసా..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు ఎంతో తెలుసా..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరాస్తులు ఎంతో తెలుసా! ఒక కోటి 75 లక్షల 63 వేల 618. ఇంత తక్కువనా అని మీరనుకోవచ్చు. కానీ మీరు విన్నది నిజమే. మరో విషయం ఏంటంటే 15 నెలల క్రితం వరకు మోదీ చరాస్తుల విలువ ఒక కోటి 39 లక్షల 10 వేల 260. అంటే 15 నెలల కాలంలో ఆయన చరాస్తులు 36 లక్షల 53 వేలు పెరిగాయి. ఈ 36 లక్షల 53 వేలు కూడా ఎలా పెరిగాయో ఊహించగలరా! బ్యాంకు వడ్డీల ద్వారా వచ్చినవే. అవును.. మోదీ పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒక సగటు మనిషి ఎలాగైతే మిగిలిన వేతనంలో కొంత భాగం బ్యాంకుల్లో దాచుకుంటాడో.. మోదీ కూడా అలాగే చేస్తారు. తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. ఈ వివరాలన్నీ స్వయంగా మోదీనే వెల్లడించారు. గత జూన్ 30 నాటికి ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను మోదీ వెల్లడించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇంతకీ మోదీ నెల జీతం ఎంతో తెలుసా! రెండు లక్షలు. అందులో ఎక్కువ భాగాన్ని ఆయన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. వాటిపై వచ్చే వడ్డీని, నెల నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తుండడం వల్ల చరాస్తులు పెరుగుతూ వస్తున్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు. చరాస్థులు పెరుగుతున్నా.. స్థిరాస్తుల విషయంలో మాత్రం తేడా లేదు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన కుటుంబంతో కలిపి ఒక ఇల్లు, ఒక ఇంటి స్థలం ఉన్నాయి. వాటి విలువ ఒక కోటి 10 లక్షలు.

మోదీ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. అంతేకాదు పన్ను మినహాయింపు ఉన్న మార్గాలపైనే దృష్టిపెడతారు. అందుకే జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లలలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే NSCS పెట్టుబడులు పెరిగాయి. కానీ బీమా ప్రీమియంలో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. జూన్‌ 30 నాటికి మోదీ సేవింగ్స్ అకౌంట్‌లో 3 లక్షల 38 వేలు మాత్రమే ఉన్నాయి. ఇక తన వద్ద నగదు రూపంలో 31 వేల 450 రూపాయలు మాత్రమే ఉన్నట్లు మోదీ వెల్లడించారు. పారదర్శకత కోసం ఆస్తులు వెల్లడించడం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం నుంచే మొదలైంది. 2004లో వాజ్‌పేయి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తూ వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story