Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. కదులుతున్న రైలు ఎక్కుతూ..

Viral Video: ట్రైన్ టైమింగ్స్ ముందుగా తెలిసినా సమయానికి చేరుకోని ప్రయాణీకులు కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలా అదృష్టం కొద్దీ బయటపడేవారు కొందరైతే, ప్రాణాలు పోగొట్టుకునేవారు మరికొందరు. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లి, కూతురు తృటిలో తప్పించుకున్నారు. వెంట్రుకలు నిక్కబొడుచుకేనే ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ముందుగా కూతురు రైలు ఎక్కింది. తల్లి ఎక్కకముందే ట్రైన్ కదిలింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లి అదుపుతప్పి గ్యాప్‌లోకి జారిపోయింది. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వ్యక్తులు వెంటనే అప్రమత్తమై మహిళను బయటకు లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. ఇంతలో ఘటనను చూసిన కూతురు కదులుతున్న రైలు నుంచి దూకి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఆమె కూడా ప్రాణాలతో బయటపడడంతో ప్రయాణీకులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇది అన్ని సమయాల్లో మంచిది కాదు.. అదృష్టం కొద్దీ బయటపడ్డారే కానీ ఎప్పుడూ ఇలా జరగదని ప్రయాణీకులు గుర్తుపెట్టుకోవాలి. సమయానికంటే ముందుగానే చేరుకోవాలి. ట్రైన్ ఆగి ఉన్నప్పుడే ఎక్కాలి అని రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com