వివాదాస్పద 'లవ్ జిహాద్' బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదముద్ర

'లవ్ జిహాద్'ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ధర్మ స్వాతంత్ర్య బిల్లు-2020ని ఆమోదించింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యతన ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త బిల్లుతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మైనర్, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్షపడనుంది. కొత్త బిల్లు ప్రకారం.. ఒకరిపై మత మార్పిడి బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, రూ25వేల జరిమానా విధించనున్నట్లు హోమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
ఒకవేళ యువతీ, యువకులు ఇష్టపూరితంగా వివాహం చేసుకోవాలి అనుకుంటే మతమార్పడి కోసం రెండు నెలల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. ఆ విధంగా చేయకుండా వివాహం చేసుకుంటే దానిని చట్ట విరుద్ధమైన వివాహంగా గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మధ్యప్రదేశ్ కంటే ముందుగా మతమార్పిడి వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూపీ అనంతరం ఇలాంటి చట్టాన్ని రూపొందించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మరోవైపు ఇలాంటి చట్టాలను రూపొందించడటంపై దేశ వ్యాప్తంగా పలువర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com