బయటబడుతున్న సచిన్ వాజే క్రిమినల్ బ్రెయిన్!

ముఖేశ్ అంబానీ నివాసం దగ్గర పేలుడు పదార్థాలతో స్కార్పియోను కనుగొన్న తర్వాత క్రైమ్ సీన్ రక్తికడుతోంది. ఈ కేసులో అప్పటి క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ హెడ్ సచిన్ వాజేను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సచిన్ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్ చేసి.. ముఖేశ్ హిరేన్ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారని ఎన్‌ఐఏ తెలుసుకుంది. ఈ కేసులో మన్‌సుక్ హిరేన్ ఫిబ్రవరి 18వ తేదీన తన స్కార్పియో పోయిందని వికోర్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ కారు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ప్రత్యక్షమైంది. ఆ రోజు సచిన్ వాజే నేతృత్వంలో క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చాలా చురుగ్గా ఈ దర్యాప్తులో పాల్గొంది. ఈ కేసు కూడా సీఐయూకే అప్పజెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన సచిన్ వాజే వికోర్లి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. 18వ తేదీన మన్‌సుక్ హిరేన్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన స్కార్పియో కేసు దర్యాప్తును ఆపేయాలని కోరాడు. బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు తన చేతిలో ఉండటంతో.. ఇక 18వ తేదీన వాహన చోరీ దర్యాప్తును కూడా ఆపేస్తే తన పాత్ర బయటపడదని వాజే భావించాడు.
తప్పుడు పేరు, ఆధార్ కార్డు సాయంతో ముంబయిలోని ట్రైడెంట్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వాజే బసచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వేరేవాళ్ల ఆధార్ కార్డుపై ఫొటోను మార్చి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అంతే కాదు.. ఆ హోటల్‌కు కొన్ని భారీ బ్యాగులను కూడా తీసుకొచ్చినట్లు సీసీటీవీ పుటేజీల్లో తేలింది. వాజే హోటల్లో బసచేసినప్పుడు ఎవరెవరు కలిశారనే అంశాన్ని ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. దీంతోపాటు 100 రోజులు అక్కడ ఉండేలా గదిని బుక్ చేసినట్లు సమాచారం. మరోపక్క సచిన్ వాజే వ్యాపార భాగస్వామి, కార్ డీలర్ ఆశీష్‌నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఒక వోల్వో ఎక్స్‌సీ 90 మోడల్ లగ్జరీ కారును స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకొన్న రెండు బెంజికార్లలో ఒకటి ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకొన్నారో ఎన్‌ఐఏ వెల్లడించలేదు.
ఎన్‌ఐఏ బృందం థానేలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ కార్యాలయంలో, భీవండీలోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ కంపెనీల్లో రెండునెలల క్రితం వరకు వాజే డైరెక్టర్‌గా పనిచేసినట్లు ఓ ఆంగ్ల వార్తాపత్రిక కథనంలో పేర్కొంది. ఇక్కడే మన్‌సుక్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. ముఖేశ్ అంబానీకి బెందిరింపుల కేసుతో మహారాష్ట్ర సర్కారు.. ముంబయి క్రైం బ్రాంచ్‌లో ప్రక్షాళన చేపట్టింది. సచిన్ వాజే ఇంటి నుంచి సీసీటీవీ డీవీఆర్‌ను తీసుకొచ్చిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ ఖాజీని బదిలీ చేశారు. వాజే మరో సహచరుడు ప్రకాశ్ హవాల్దాను వేరోచోటుకు పంపించారు. వీరికి ఒకరిని పోలీస్ ఆయుధ విభాగం, మరొకరిని మలాబార్‌హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ బదిలీల జాబితాలో మొత్తం 86 మంది ఉన్నారు. వీరిలో క్రైమ్ బ్రాంచికి చెందినవారే 65 మంది ఉన్నారు.
మరోవైపు.. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను హోంగార్డ్ డీజీగా బదిలీ చేయడంతో పాటు దేశ్‌ముఖ్‌పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు తీవ్రమైనవే అయినప్పటికీ ముందు బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్‌వాజే అరెస్టు తర్వాత పరమ్‌వీర్‌ను హోంగార్డ్ డీజీగా బదిలీ చేశారు. అయితే బదిలీ అనంతరం మాజీ కమిషనర్ సంచలన ఆరోపణలు చేశారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రతి నెలా 100కోట్ల రూపాయల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఈ లేఖ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. మరోవైపు దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అటు.. మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్రపతికి నివేదిక పంపాలంటూ ప్రతిపక్ష నేత.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిశారు. బీజేపీ డిమాండ్ నేపథ్యంలో సీఎస్‌ను గవర్నర్ నివేదిక కోరే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శరద్ పవార్ తన మంత్రిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ ఉదంతంపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో తెలియడం లేదని.. అది రెండు విధాలా మాట్లాడుతోందంటూ దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com