Mulayam Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్‌ కన్నుమూత

Mulayam Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్‌ కన్నుమూత
Mulayam Singh Yadav:

Mulayam Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్‌ కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 22న మేధాంత హాస్పిటల్‌లో చేరారు ములాయం సింగ్‌. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తు వచ్చారు వైద్యులు.

ములాయం సింగ్‌ 1939 నవంబర్‌ 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫాయ్‌ గ్రామంలో జన్మించారు. రామ్‌మనోహర్‌ లోహియా, రాజ్‌ నారాయణ్‌ వంటి నేతల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం...1967లో మొదటి సారి జశ్వంత్‌ నగర్‌ నుంచి యూపీ అసెంబ్లీకి పోటీ చేశారు. దాదాపు అక్కడి నుంచి 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా...7 సార్లు ఎంపీగా పని చేశారు ములాయం సింగ్ యాదవ్‌. 1977లో తొలిసారి రాష్ట్ర కేబినెట్‌లో చేరారు ములాయం.

తర్వాత 1996లో మొయిన్‌పురి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సంభాల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ములాయం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్నౌజ్‌, సంభాల్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత కన్నౌజ్ సీటుకు రాజీనామా చేశారు. మూడు సార్లు యూపీ సీఎంగా పని చేశారు ములాయం. ప్రస్తుతం మొయిన్‌పురి నుంచి ఎంపీగా ఉన్నారు.

1990 లో వీపీ సింగ్ సర్కార్‌ కూలిపోవడంతో చంద్రశేఖర్‌ జనతాదళ్‌ సోషలిస్టు పార్టీలో చేరారు ములాయం. కాంగ్రెస్ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1991లో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం పదవిని కోల్పోయారు. 1992లో సొంతంగా సమాజ్‌ వాదీ పార్టీ స్థాపించారు ములాయం. 1993లో బీఎస్పీతో ఎన్నికలకు వెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ కూటమి యూపీలో విజయం సాధించింది. దీంతో ములాయం రెండో సారి సీఎం అయ్యారు. 2003లో మూడోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేశారు.

ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్‌ మనోహర్‌ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్‌ నారాయణ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారన్నారు.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story