ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.. ఎందుకు గొడవైంది ఇద్దరికీ..

వారిద్దరూ పాటల పూదోటలో విహరించిన కోయిలలు.. పాటకు ఆయన ట్యూన్ ఇస్తే.. ఈయన టోన్ అందించేవారు.. ఇద్దరూ కలిసి చేసిన పాటలు సంగీత ప్రియుల్ని మంత్ర ముగ్థుల్ని చేసేవి. అలాంటి వారిద్దరి మధ్య ఎందుకు గొడవైంది.. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని ఎస్పీ స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. కొత్తతరం గాయకులు రావడంతో బాలు చిత్రాల్లో పాటలు పాడడం తగ్గించారు. దేశ విదేశాల్లో షోలు నిర్వహిస్తూ, ఛానెల్‌లో పాటలకు సంబంధించిన ప్రోగ్రామ్‌కి జడ్జిగా వ్యవహరిస్తూ సంగీత అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే అమెరికాలోని సీటల్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ కావడంతో అమితానందాన్ని వ్యక్తం చేసిన బాలు.. అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ధన్యుడని, నిర్వాహకులు షోని బాగా నిర్వహించారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కాగా, ఇళయరాజా తాను కంపోజ్ చేసిన పాటలను ఎస్పీ ప్రదర్శనలలో ఆలపిస్తే పెద్ద మొత్తంలో జరిమానా, చట్టపరమైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. దానికి బాలు కూడా ఇకపై ఇళయరాజా పాటలను తమ బృందం పాడదని, తమ ప్రదర్శనలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు. దేవుడి దయవల్ల ఇతర సంగీత దర్శకులకు అనేక పాటలు పాడానని, ఇక మీదట వాటిని ఆలపిస్తానని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఎస్పీ అభిమానులను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com