Nagaland: భద్రతా దళాల పొరపాటు.. సామాన్య ప్రజలు మృతి..

Nagaland (tv5news.in)
Nagaland: నాగాలాండ్‌లో భద్రతా దళాలు పొరపాటున పౌరులపై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఓటింగ్, మోన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో.... ఆర్మీ 21 పారా కమాండో యూనిట్ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి. అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అందులో ఉన్నది ఉగ్రవాదులని అనుమానించిన దళాలు.. ఆ వాహనంపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు మరణించారు.
అయితే ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు.. వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. కానీ కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక జవాన్ మృతి చెందటంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. రెండోసారి కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. 15 మంది దుర్మరణం పాలైన ఘటనపై కోర్టు ఎంక్వైరీకి భారత సైన్యం ఆదేశించింది. మేజర్ జనరల్ ర్యాంకు అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్రం 11 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.
రాష్ట్రం నుంచి సాయుధ బలగాల చట్టాన్ని ఉపసంహరించాలని కూడా కేంద్రాన్ని నాగాలాండ్ నేఫియూ రియో కోరారు. ఈ చట్టం దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని ఆయన పేర్కొన్నారు. మరణించిన పౌరులకు నివాళులర్పించి.. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా... లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు.
సైన్యం పొరపాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందన్న ఆయన.. ఘటనపై సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల్లోగా నివేదిక ఇస్తుందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భద్రతా బలగాలను హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు. నాగాలాండ్ ఘటనపై చర్చ జరపకుండా.. అమిత్ షా కేవలం వివరణ మాత్రమే ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీనిపై సవివర చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సభలో ఆందోళనకు దిగాయి. అయితే లోక్‌సభ స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com