Narendra Modi: తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

Narendra Modi (tv5news.in)
Narendra Modi: యూపీలో ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభానికి సిద్ధమైంది. తన డ్రీమ్ ప్రాజెక్టును ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో వారణాసిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెండు కారిడార్లుగా కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ రూపొందించారు. తొలి కారిడార్ ఇవాళ అందుబాటులోకి వస్తుంది. రెండో కారిడార్ జనవరిలో.. ప్రారంభించే అవకాశం ఉంది.
వారణాసి ప్రాచీన చరిత్ర, కాశీ విశ్వనాథుని ఆలయం వైభోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కారిడార్‌ను రూపొందించారు. వారణాసి చరిత్రను ప్రతిబింబించేలా.. మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఆమె జీర్ణోద్ధరించారు.
టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, మ్యూజియం, ఆడిటోరియాలు, భజన మందిరాలు, భక్తుల సౌకర్యాల కోసం కొత్తగా నిర్మించిన వసతి గదులు.. గోడౌలియా గేట్, భోగ్‌శాల, ఆలయ అర్చకులు, సేవకుల కోసం విశ్రాంతి కేంద్రాల వంటివి.. ఈ కారిడార్ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించారు. ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ, ఇతర సౌకర్యాలకు రెండో కారిడార్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
20 రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న మూడో భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించకుంది. గత నెలలో గ్రేటర్ నొయిడాలో విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించారు. రెండు రోజుల కిందటే సరయూ నదీ కాలువ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com