Narinder Kaur Bharaj: అతి పిన్న వయస్సులో ఎమ్మెల్యే.. ఎవరీ నరీందర్ కౌర్ భరాజ్

Narinder Kaur Bharaj: బాగా చదువుకుంది.. మంచి ఉద్యోగం వస్తుంది.. కానీ అది కాదు తనకి కావలసింది.. తన ఊరి వాళ్ల కోసం, తన లాంటి వారికోసం తానేం చేయగలదో ఆలోచించింది. రాజకీయాలంటే ఆసక్తి.. 19 ఏళ్ల వయసులోనే ఆమ్ ఆద్మీ పట్ల ఆకర్షితురాలైంది. పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. ప్రజలతో మమేకమవుతూ, ప్రజల అవసరాలు గుర్తిస్తూ పార్టీలో ముఖ్య వ్యక్తిగా ఎదిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే అయింది.
పంజాబ్‌లో అతి పిన్న వయస్సులో ఎమ్మెల్యే అయిన 27 ఏళ్ల నరీందర్ కౌర్ భరాజ్, కాంగ్రెస్ సభ్యుడు, క్యాబినెట్ మంత్రి అయిన విజయీందర్ సింగ్లాపై 36,430 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ గెలుపు ఆప్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. భగవంత్ మాన్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన నరీందర్ కౌర్ భరాజ్ విజయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటోంది పంజాబ్. రాజకీయాల్లో అనుభవంతో పాటు, ధనం విచ్చలవిడిగా ఖర్చుచేసిన వారే గెలుస్తారనే అపవాదుని భరాజ్ బద్దలు కొట్టింది.
మహా మహులైన నేతలకు వ్యతిరేకంగా ఆమె నిలబడడంతో భరజ్ విజయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ఒక చిన్న అమ్మాయి పెద్ద వాళ్లను ఓడించింది అని పార్టీ మద్దతుదారులు భరాజ్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆమె తన తల్లితో కలిసి స్కూటర్ మీద తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసింది. పని పట్ల తనకున్న నిబద్ధతను, ప్రజల పట్ల తనకున్న ఆలోచనా విధానాన్ని ఈ విజయం మార్చలేదని అంటోంది.
భరాజ్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చింది. ఆమె తన గ్రామం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి గుర్నామ్ సింగ్‌కు సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామంలో ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె అన్నయ్య 2002లో మరణించాడు.
భరాజ్ పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని, స్థానిక సంగ్రూర్ కళాశాల నుండి లా డిగ్రీని పూర్తిచేసింది. 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఆకర్షితురాలైన భరాజ్ ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భగవంత్ మాన్‌కు పోలింగ్ ఏజెంట్‌గా పనిచేసింది.
2018లో, AAP యొక్క యువజన విభాగం సంగ్రూర్ యూనిట్ అధ్యక్షురాలిగా భరాజ్ నియమితురాలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా, మహిళలు, పిల్లల అభ్యున్నతి గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ప్రతి మహిళకు ఆమెకంటూ కొన్ని సొంత ఖర్చులు ఉంటాయి. అందుకే తాను ఎమ్మెల్యే అయ్యాక మొదట చేసే పని మహిళల ఖాతాలో రూ.1,000 జమ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చింది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణాలకే పరిమితం కాకూడదని, అవినీతి నిర్మూలన, వైద్యం, విద్యా రంగాల్లో మార్పులు అవసరమని భరాజ్ తెలిపింది. ఎమ్మెల్యే అయినా ఓ విఐపీలా తాను ఉండాలని కోరుకోవట్లేదని, ఓ సాధారణ వ్యక్తిలాగే జీవిస్తానని ప్రజలతో మమేకమై వారి అవసరాలు తెలుసుకుంటానని తెలిపింది. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com