National: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ హైక్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. గతేడాది డిసెంబరుకు సంబంధించిన పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్ర చెప్పారు. ఆర్థికశాఖ ఈ మేర డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరవు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ 2022 సెప్టెంబరు 28న జరిగింది. ఇది 2022 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం ఏటా రెండుసార్లు సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com