National: వచ్చిన చీతాల్లో ఒకటి మృతి

National: వచ్చిన చీతాల్లో ఒకటి మృతి
ఎనిమిది చీతాలకు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల

ఆపరేషన్ చీతాలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. గతేడాది నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి మృతి చెందింది. అప్పట్లో ఎనిమిది చీతాలకు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే వాటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో మృతి చెందింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో అది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

జనవరి 22న సాశా అస్వస్థతతో కనిపించిందన్నారు. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌లోకి తరలించినట్లు తెలిపారు. రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలిందన్నారు. దాని ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషించగా.. భారత్‌కు తీసుకొచ్చే ముందే ఈ సమస్య ఉన్నట్లు తేలిందన్నారు. స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారని ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వెల్లడించారు.

నమీబియా నుంచి 4- 6 ఏళ్ల వయసున్న 8 చీతాలను కేంద్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. ఇందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. మిగతా ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాలు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. భారత్ లో 1950 తర్వాత చీతాలు కనుమరుగయ్యాయి. జీవవైవిధ్యం కాపాడే ఉద్దేశంతో ఆఫ్రికా నుంచి భారత్ కు చీతాలను రప్పించారు. గతేడాది ఈ చీతాలు ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story